ArticlesNews

వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి? అది ఎలా బలం పుంజుకుంది?

66views

భారతదేశంలో మతపరమైన ఎన్నో వివాదాల్లో నిత్యం నానుతుండే పేరు వక్ఫ్ బోర్డ్. అలాంటి వక్ఫ్ బోర్డ్ ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశమైంది. అపరిమితమైన, విశేషమైన వక్ఫ్‌బోర్డ్ అధికారాలకు కత్తెర వేయడానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలు వస్తున్నాయి. వాటిని పార్లమెంటులో పెట్టి వక్ఫ్‌బోర్డు చట్టానికి సవరణలు కూడా చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సమాచారం. ముఖ్యంగా, తమకు కనిపించిన చోటల్లా ఆకుపచ్చ చాదర్ కప్పి ఆ స్థలం మాదే అని లాగేసుకునే, కబ్జా చేసుకునే విధానానికి చెక్ పెట్టనున్నారు.

అసలు వక్ఫ్‌బోర్డ్ ఎలా పనిచేస్తుంది?
వక్ఫ్ అనేది అరబ్బీ భాషా పదం. దేవుడి పేరు మీద సమర్పించిన వస్తువు లేదా లోకోపకారం కోసం ఇచ్చే డబ్బు అని ఆ పదానికి అర్థం. అంటే వక్ఫ్ పరిధిలోకి స్థిర, చర ఆస్తులు అన్నీ వస్తాయన్నమాట. మన దేశంలో వక్ఫ్ బోర్డ్ ప్రధానంగా ముస్లిముల భూములపై నియంత్రణ కోసం ఏర్పాటయింది. ఆ భూముల దుర్వినియోగం, చట్టవ్యతిరేక విక్రయాలు వంటివాటిని నియంత్రించడం దాని లక్ష్యం. కానీ ఇవాళ వక్ఫ్ బోర్డ్ చేస్తున్న పనులు దానికి సరిగ్గా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవాళ దేశంలో వక్ఫ్‌బోర్డ్ ఎక్కడైనా కబరిస్తాన్ (శ్మశానం) కోసం భూమిని ఆక్రమిస్తుందో, దాని చుట్టుపక్కల ఉండే భూమినంతటినీ తనదేనని ప్రకటించేసుకుంటోంది. ఆ మజార్‌లను, చుట్టుపక్కల ఉండే భూములనూ సొంతం చేసేసుకుంటోంది.

వక్ఫ్ చట్టం 1995 ప్రకారం ఒక ప్రదేశం తనది అని వక్ఫ్ బోర్డ్ భావిస్తే, ఆ విషయాన్ని నిరూపించాల్సిన బాధ్యత వక్ఫ్ బోర్డ్ మీద ఉండదు. ఆ ప్రదేశపు నిజ యజమానే అది వక్ఫ్ ఆస్తి కాదు అని నిరూపించాలి. ఏదైనా ప్రైవేటు ఆస్తిని వక్ఫ్ బోర్డ్ తనదిగా ప్రకటించుకోలేదు అని 1995 వక్ఫ్ చట్టంలో ఉన్నమాట నిజమే కానీ అసలు ఆ ఆస్తి ప్రైవేటుది అని ఎలా తెలుస్తుంది? ఏదైనా ఆస్తి తనది అని వక్ఫ్ బోర్డ్ భావిస్తే, దాన్ని నిరూపించడానికి ఎలాంటి దస్తావేజులూ లేక పత్రాలూ సాక్ష్యాలుగా వక్ఫ్ బోర్డ్ చూపించనక్కరలేదు. ఆ బాధ్యత ఆ స్థలం తనది అని చెప్పుకునే వ్యక్తిమీదనే ఉంటుంది. చాలామంది దగ్గర వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తుల తాలూకు కాగితాలు సరిగ్గా ఉండవు. దాన్ని ఆసరా చేసుకుని వక్ఫ్ బోర్డ్ అలాంటి స్థలాలను కబ్జా చేసేస్తోంది. ఎందుకంటే అలాంటి కాగితాలు చూపించాల్సిన అవసరం వక్ఫ్ బోర్డ్ మీద లేదు కదా.

వక్ఫ్ బోర్డ్ అధికారాలను బలపరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం
మొట్టమొదటగా 1954లో పండిత నెహ్రూ పరిపాలనా కాలంలో వక్ఫ్ బోర్డ్ ఏర్పాటు కోసం చట్టం చేసారు. 1964లో కేంద్రీయ వక్ఫ్ బోర్డ్ ఏర్పాటయింది. 1995నాటి సవరణలతో వక్ఫ్ బోర్డ్‌కు అపరిమిత అధికారాలు సమకూరాయి. పీవీ నరసింహారావు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించింది. ఎన్నో కొత్తకొత్త ప్రకరణాలు జోడించి వక్ఫ్ బోర్డుకు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టింది. ఆ చట్టంలోని సెక్షన్ 3(ఆర్) ప్రకారం ఏదయినా ఆస్తిని ముస్లిం చట్టాల ప్రకారం పవిత్రం, మజహబీ, లేక దానంగా పరిగణిస్తే అది వక్ఫ్ ఆస్తి అయిపోతుంది. అదే చట్టంలోని 40వ అధికరణం ప్రకారం భూమి ఎవరిదన్న సంగతిని వక్ఫ్ సర్వేయర్, వక్ఫ్ బోర్డ్ కలిసి నిర్ణయిస్తారు. వక్ఫ్ చట్టానికి 2013లో చేసిన సవరణల ప్రకారం అటువంటి వ్యవహారాల్లో వక్ఫ్ బోర్డుకు అవధులు లేని, పరిపూర్ణమైన స్వయంప్రతిపత్తి కట్టబెట్టారు.

ప్రస్తుతం దేశంలో 8.7లక్షల కంటె ఎక్కువ ఆస్తులు, సుమారు 9.4లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డ్ అధీనంలో ఉన్నాయి.