News

7 నుంచి భీమేశ్వరుని మూలవిరాట్‌ దర్శనాలు

47views

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి మూలవిరాట్‌ దర్శనాలకు ఈ నెల 7 నుంచి భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. ఆలయ ఈఓ పితాని తారకేశ్వరరావు విలేకర్లకు ఈ విషయం తెలిపారు. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యాన మూలవిరాట్‌ జీర్ణోద్ధరణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. వీటిని పూర్తి చేసిన అనంతరం ఈ నెల 5 నుంచి 7 వరకూ సంప్రోక్షణ, విశేష కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఈఓ తెలిపారు. 5న కళావాహన, గణపతి పూజ, పుణ్యాహవాచనం, పరిషత్‌, కుచ్చత్రయం, మండపారాధన, రుత్విక్‌ వరుణలు, దీక్షధారణ, కృష్ణ యజుర్వేద పారాయణ, గణపతి హోమం, వాస్తు హోమం, చతుర్వేద స్వస్థి నిర్వహిస్తామని వివరించారు. 6న గణపతి పూజ, పుణ్యాహవాచనం, కుచ్చత్రయం, పునఃపూజలు, ఉదయ శాంతి, శతరుద్ర, శ్రీసూక్త, దుర్గా సూక్త, శుక్ల యజుర్వేద పారాయణలు, రుద్ర, చండీ హోమాలు, చతుర్వేద స్వస్తి జరుగుతాయన్నారు. ఏడో తేదీన గణపతి పూజ, పునఃపూజలు, రుగ్వేద పారాయణ, గర్భాలయ పూజలు, పరివార దేవతార్చనలు, కుంభాలు, గోదర్శనం, శాంతి హోమం, పూర్ణాహుతి అనంతరం ఉదయం 9.34 గంటలకు కళావాహన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. అనంతరం ఉదయం 11.05 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తామని ఈఓ తెలిపారు.