News

రైట్ వింగ్ పత్రిక ‘కాంపాక్ట్’ను నిషేధించిన జర్మనీ

45views

పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం గురించి భారతదేశానికి పదే పదే ఉపన్యాసాలు ఇచ్చే పాశ్చాత్య దేశాలలో జర్మనీ కూడా ఒకటి. అటువంటి ఉదారవాద దేశంగా చెప్పుకునే జర్మనీ హఠాత్తుగా రైట్ వింగ్ కాంపాక్ట్ పత్రికను నిషేధించింది. ఐరోపావ్యాప్తంగా, రైటిస్టు రాజకీయ పార్టీలకు ప్రాచుర్యం వస్తున్న నేపథ్యంలో జర్మనీ ఈ చర్య తీసుకున్నట్టు కనిపిస్తోంది. యూదులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని రగులుస్తోందన్న సాకుతో ఠక్కున దాన్ని మూసివేశారు. పైగా, రాజ్యాంగ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పనిచేస్తోందంటూ ఆ పత్రికకు సంబంధించిన ఆస్తులపై ప్రభుత్వం దాడులు జరిపించింది.

ఇప్పటికే జర్మనీలో కూడా ఇస్లాం గోల మొదలైన నేపథ్యంలో ఇటువంటి పత్రికలు ప్రజలకు కనువిప్పు కల్గిస్తాయేమోనని ప్రభుత్వం భయపడు తున్నట్టు కనిపిస్తోంది. దీనిని రైట్వింగ్ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఎఎఫ్ డి) పార్టీ తిరుగుబాటు విభాగానికి ప్రచారాస్త్రంగా చూసినప్పటికీ, దాని సర్క్యులేషన్ 40వేలు కాగా, భారీగా సోషల్ మీడియా ఉనికిని కలిగి ఉంది. ఈ నిషేధం కాంపాక్ట్ అనుబంధ సంస్థ అయిన కాన్స్పెక్ట్ ఫిల్మ్లు కూడా వర్తించి, దాని కార్యకలాపాల కొనసాగింపును నిషేధిస్తోంది. కాగా, ప్రభుత్వం నియంతలా ప్రవర్తిస్తూ ఈ నిషేధాన్ని చేసిందని, జర్మనీ పత్రికా స్వేచ్ఛపై గత కొన్ని దశాబ్దాలలో ఇది దారుణమైన దాడి అని, తమ గొంతునొక్కేందుకు చూస్తున్నారని కాంపాక్ట్ ఎడిటర్ జ్యుర్గెన్ ఎల్సాసెర్ గగ్గోలు పెడుతున్నాడు.