ArticlesNews

మసీదులుగా మారిన మందిరాలు -3

78views

జ్ఞానవాపితో పాటు..మసీదులుగా మారిన ఆలయాలు దేశంలో ప్రతిచోటా ఉన్నాయి. ఎందుకంటే దేశంలో ముస్లిం దండయాత్రకు గురికాని ప్రదేశాలు కొన్ని మాత్రమే. కానీ వీటి గురించి పూర్తి సమాచారం బయటపడడం లేదు. చరిత్రకారులు కొందరు సెక్యులర్‌ ముసుగుతో వాస్తవాలు ఇవ్వడం లేదు. రగడకు భయపడి స్థానికులు ముందుకు రావడం లేదు. అయినా అలాంటి వాటి కోసం న్యాయ పోరాటాలు ప్రారంభమయ్యాయి. ఉదాహరణకు వారణాసిలోని అలంగీర్‌ మసీదు. దీనినే ఔరంగజేబ్‌ మసీదు అని కూడా పిలుస్తారు. పంచగంగ ఘాట్‌ వద్ద ఉంది. వారణాసి మీద ఔరంగజేబ్‌ 1669లో దాడి చేసి, ఆక్రమించాడు. అక్కడే ఉన్న బిందుమాధవుడి (విష్ణువు) ఆలయాన్ని కూల్చాడు. ధార్హాదారా మసీదు లోపల ఉన్న బిందుమాధవుడికి పూజలు చేసే అవకాశం కల్పించాలని 2022లో హిందువులు కోర్టును ఆశ్రయించారు. ఆ మసీదు 12వ శతాబ్దం నాటి బిందుమాధవుని ఆలయాన్ని కూల్చి నిర్మించారని, ఔరంగజేబు కాలంలో మొదలైన నిర్మాణం అతడి వారసుడు షా ఆలం (1707`1712) వారణాసి సైనిక అధికారి అలీ ఇబ్రహీం ఖాన్‌ పర్యవేక్షణలో పూర్తి చేశారని చరిత్ర. కృత్తివాసేశ్వర శివాలయం శిథిలాల మీద మసీదును నిర్మించాడని వివాదం ఉంది.

బదయూన్‌ జామా మసీదు మొదట గుడే?

2022లో బయటకొచ్చిన మరొక వివాదం బదయూన్‌ (ఉత్తరప్రదేశ్‌) షమ్సి జామా మసీదు. ఈ భారీ మసీదును 800 ఏళ్ల క్రితం కట్టారని, దేశంలోనే పురాతనమైనదని అంటారు. ఇది మసీదు కాదనీ, హిందూ ఆలయమనీ చెబుతూ వీపీ సింగ్‌, బీపీ సింగ్‌ అనే న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. స్థానిక ముస్లింలు ఇది బానిస వంశీకుడు ఇల్‌టుట్‌మిష్‌ (1223) కట్టించాడని, చిరకాలంగా అందులో ముస్లింలు నమాజ్‌ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ వాదనను న్యాయవాది వీపీ సింగ్‌ అంగీకరించడం లేదు. ఇది హిందూ దేవాలయమని వాదిస్తూ హిందూ మహాసభ మద్దతుతో వారు 2022 జూలైలో కోర్టుకు వెళ్లారు. ఆ మసీదు 10వ శతాబ్దం నాటి శివాలయాన్ని మసీదుగా మార్చారని సింగ్‌ వాదన. కొన్ని ఇతర హిందూ దేవాలయాలు ఇప్పటికీ ఆ ప్రాంగణంలో మిగిలి ఉన్నాయని కూడా ఆయన చెబుతున్నారు.

వాస్తవాలను దాచడమే పనిగా…

ధార్మిక రంగం వరకు వాస్తవంగా నష్టపోయినది హిందువులేనని చరిత్ర సాక్ష్యం చెబుతున్నది. అయితే ముస్లింలే నష్టపోయారని విదేశీ రచయితలు, స్వదేశీ చరిత్రకారులు చిత్రిస్తున్నారు. ఉదాహరణకి జ్ఞానవాపి మసీదులో 1990 వరకు హిందువులకు ప్రవేశం ఉంది. సంవత్సరంలో ఒకరోజు వారికి గౌరి పూజకు అనుమతించే పద్ధతి ఉంది. దీనిని రామజన్మభూమి ఉద్యమం నేపథ్యంలో ములాయం సింగ్‌ యాదవ్‌ నిషేధించాడు. ఈ విషయాన్ని దాచి పెట్టి ముస్లింలకే చెందిన ఆ కట్టడాన్ని ఆక్రమించడానికి హిందూ సంఘాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయని వారు ఆరోపిస్తూ ఉంటారు. 1990 వరకు హిందువులకు ప్రవేశం ఉందన్న సంగతి అవాస్తవమని జ్ఞానవాపి మసీదు సంరక్షకుడు సయద్‌ మహమ్మద్‌ యాసీన్‌ అడ్డంగా అబద్ధం ఆడాడు. ఇందుకు సంబంధించి కోర్టు నిర్ణయం పక్కనే ఉన్నా, యాసీన్‌ మాటనే విదేశీ మీడియా ప్రచురించింది. దీనికి మించిన దుర్మార్గం మరొకటి. అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాయంలో చరిత్ర ఆచార్యునిగా పనిచేసే సయద్‌ అలీ నదీమ్‌ రెజ్వీ హిందువులు చేస్తున్న పోరాటాలన్నీ సమంజసమైనవి కాదని చెబుతున్నాడు. మొగలులు కొన్ని హిందూ కట్టడాలు కూల్చిన నిజమే అయినా హిందువులు చెబుతున్న అంత పెద్ద సంఖ్యలో కాదని అంటారీయన. దేశంలో ఒక చిత్రమైన పరిస్థితి ఉంది. న్యాయవాది, చరిత్రకారుడు, పత్రికా రచయిత, కళాకారుడు, ఆఖరికి జర్నలిస్ట్‌ ఎవరైనా సరే, వారు ముస్లింలైతే ఆ వర్గం వాదననే వినిపిస్తారు. వారి మాటలలో సత్యనిష్ట కానరాదు. అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం ఆచార్యుడు చేస్తున్నది ఇదే. అరిజోనా యూనివర్సిటీ ఆచార్యుడు రిచర్డ్‌ ఈటన్‌ ముస్లింలు భారతదేశంలో నాశనం చేసినది వేలాది దేవాలయాలు కాదని, కేవలం 80 అని అంటాడు. కానీ వీరెవరూ విల్‌ డ్యూరాంట్‌ ఏం చెప్పారో దాచి పెడతారు.

భారత్‌ మీద ముస్లిం దురాక్రమణదారుల దాడులు విశ్వమానవ చరిత్రలోనే రక్తసిక్తమైన గాథలు అన్నారాయన. క్రూసేడ్స్‌ (పవిత్ర యుద్ధాలు) మీద పరిశోధన చేసిన బ్రిటిష్‌ చరిత్రకారుడు పీటర్‌ జాక్సన్‌ ముస్లిం చరిత్రకారులు (సమకాలికులు) ఏమి రాశారో ప్రపంచానికి గుర్తుచేశారు. భారత్‌లో ఇస్లాం వ్యాప్తిని ఆ పాలకులు పవిత్రయుద్ధంగానే భావించారని జాక్సన్‌ తేల్చి చెప్పారు. ముస్లిం పాలకుడి సైన్యాన్ని ఇస్లాం సేనగానే వ్యవహరించారు. లక్ష్యంగా చేసుకున్న హిందువులు కాఫిర్లు లేదా అవిశ్వాసులు. అలాంటి దృక్పథం ఉన్న క్రూర పాలకులు ఆలయాలను నిలవనిస్తారా? 1990 ప్రార్థనా స్థలాల చట్టానికి ఉన్న చట్టబద్ధత, వాస్తవికతల మీద భారతీయ న్యాయస్థానాలలోనే భేదాభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఈ చట్టం ఉన్నా భారతదేశంలో అడుగున గుడులు ఉన్నాయంటూ మసీదులను కూలుస్తున్నారని వాదించేవారు విశ్వవ్యాప్తంగా ఉన్నారు.

ఇటీవలి కాలంలో హిందువులు ఏ విజయం సాధించినా, లేదా ఏ పోరాటం ప్రారంభించినా దానిని అయోధ్యతో ముడి పెడుతున్నారు. లేదా నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం కొలువైన 2014 సంవత్సరం తరువాతి పరిణామంగా చూస్తున్నారు. అంతేతప్ప హిందువుల ఆత్మగౌరవ పోరాటాలుగా వీటిని పరిగణించే సంస్కారం ఇంకా రాలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావానికే ముందే (1925), బీజేపీ నిర్మాణానికి ముందే (1980) హిందువుల ఆత్మగౌరవ పోరాటాలు ఉన్నాయి. అయోధ్య రామజన్మభూమిని కేవలం న్యాయ పోరాటంతో హిందువులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 1528 నుంచి 2019 వరకు సాగిన పోరాటమది. అంతిమంగా సుప్రీంకోర్టుకు చేరింది. భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు మేరకు అక్కడ ఆలయ నిర్మాణం, ప్రాణప్రతిష్ఠ జరిగాయి. అయోధ్య న్యాయపోరాటంతో సమాంతరంగానే దేశంలో మరిన్ని న్యాయపోరాటాలు మొదలయ్యాయన్నది నిజం. ఇప్పటికే పలు మసీదుల మీద హిందూ సంఘాలు వ్యాజ్యాలు నడుపుతున్నాయి. ఈ దేశంలో మధ్యయుగాల నుంచి 30,000 నుంచి 40,000 దేవాలయాలు విదేశీ దురాక్రమణదారుల చేతులలో ధ్వంసమైనాయని ఇటీవల సాక్ష్యాలతో చూపిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది.

దేశంలోని చాలా మసీదులు గుడుల మీద నిర్మించినవేనని లేదా గుడులను మసీదులుగా మలిచినవేనని వారి వాదన. తెలుగు ప్రాంతాలు సహా చాలాచోట్ల ఆలయాలలో దర్గాలు కనిపిస్తాయి. చాలాచోట్ల ఆలయాలు మసీదులుగా మారిపోయా యని ఆ ప్రాంగణం ఆనవాళ్లే తిరుగులేకుండా నిరూపిస్తూ ఉంటాయి. స్థల పురాణాలే కాదు, చరిత్ర కూడా మౌనసాక్షిగానే ఉండిపోయాయి. ఆ నిర్మాణం, వాస్తు, స్తంభాలు, ఆకృతి, గోడలమీద శాసనాలు, స్తంభాల మీది శిల్పాలు అన్నీ అది హిందూ ఆలయమని సాక్ష్యం చెబుతూనే ఉంటాయి. అయినా వాటి గురించి మాట్లాడరాదని, హిందువులు హక్కు కోసం ప్రయత్నించరాదని సెక్యులరిస్టు ప్రభుత్వాలు, ఉదారవాదులు గగ్గోలు పెడుతూ ఉంటారు. నివేదికలు లీక్‌ అయ్యాయంటూ, న్యాయస్థానాలను గౌరవిస్తాం కానీ, జరిగిన నిర్ణయాలను కాదంటూ ముస్లిం సంఘాలు ఇప్పటికీ మాట్లాడుతున్నాయి.

న్యాయస్థానాల తీర్పులను తప్పు పట్టేవారు కూడా లేకపోలేదు. మొత్తంగా చూస్తే తమదైన హక్కు కోసం, చరిత్రలో తమకు జరిగిన అన్యాయాన్ని సరిచేసు కోవడానికి కోర్టుల ద్వారా కూడా హిందువులు ప్రయత్నం చేయకూడదన్నదే, జరిగిన దానికే కాదు, జరగబోయే దానికి కూడా వారు మౌనంగా ఉండాలనే ఇక్కడ ముస్లింలు, మేధావులు, ఉదార వాదుల లక్ష్యంగా కనిపిస్తున్నది.