NewsProgramms

ఎస్. ఎస్. ఎఫ్ విజయ పరంపర ఇలాగే కొనసాగాలి – పూజ్య ధర్మాచార్యులు, ప్రముఖుల ఆకాంక్ష

1kviews

ప్రజల సమగ్ర వికాసానికి దేవాలయమా? విద్యాలయమా? ఏది అవసరం?  అంటూ గతంలో కొందరు కొత్త చర్చను లేవదీశారు. నిమ్న వర్గాల వికాసానికి చదువు మొదటి అవసరం అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. వారు మార్క్సిస్టు ఆలోచనా విధానాన్ని తిరస్కరిస్తూ మనిషి వికాసానికి, మనసు పరిణతికి మతం కూడా ఒక పరిమితి మేరకు అవసరమే అని భావించి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆలోచన మేరకు సమరసతా సేవా ఫౌండేషన్ దేవాలయము, పాఠశాలలను సమన్వయ పరుస్తూ బాలవికాస కేంద్రాలను ప్రారంభించింది. ఆట పాట, చదువు, దేశభక్తి, మానవ విలువల పట్ల నిర్లక్ష్య ధోరణి కనిపిస్తున్న నేటి తరుణంలో ఎస్ ఎస్ ఎఫ్ ఏడు నెలల కాలంలోనే ఆ దిశగా అద్భుత విజయాలను సాధించి చూపింది.

గత సంవత్సరం సమరసతా సేవా ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలలో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహకారంతో 500 దేవాలయాలను నిర్మించింది. గతంలో ప్రధాన గ్రామంలోని గుడిలోనికి నిమ్న వర్గాల వారిని అనుమతించని అగ్రకులాల వారే ఈ దేవాలయాల నిర్మాణానికి స్వచ్ఛందంగా ఆర్థిక సహకారాన్ని అందించారు. ఈ దేవాలయాలలో ఎస్సీ, ఎస్ టి, మత్స్యకార సామాజిక వర్గాల వారే దేవాలయ అర్చకులుగా పని చేస్తున్నారు. ఇప్పుడు ఈ దేవాలయాల వద్దకు గ్రామాలలోని అగ్ర కులాల వారు కూడా వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండటం విశేషం. ఈ దేవాలయాల కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా 150 చోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీనివాస కళ్యాణాలను నిర్వహించారు. ఆ సందర్భంగా గ్రామాలలోని అన్ని కులాల వారు వందల వేల సంఖ్యలో పాల్గొని పక్కపక్కనే కూర్చుని ఆ కళ్యాణాలను దర్శించడం విశేషం. ఈ సందర్భంగా దేవుని ముందు అందరూ సమానమే అన్న విషయాన్ని మన ప్రజలు మరోసారి ఆచరించి చూపారు.

ఈ దేవాలయాల కేంద్రంగా హైస్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు, బడి మానివేసిన బాలబాలికలకు రోజూ రెండు గంటల పాటు చదువు, ఆట పాటలను నేర్పడం తోపాటు వారిలో దైవభక్తిని, దేశభక్తిని మేల్కొలిపే కార్యక్రమాలను గత వినాయక చవితి నాటి నుండి సమరసత సేవా ఫౌండేషన్ ప్రారంభించింది. ఈ బాలవికాస కేంద్రాలలో అధ్యాపకులు కూడా ఇంటర్, డిగ్రీ చదువుతున్న స్థానిక యువతీ యువకులే.

డిసెంబర్ నెలలో 17 చోట్ల బాలవికాస కేంద్రాల వార్షికోత్సవాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో బాలవికాస కేంద్రాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం లేచిన వెంటనే తమ పిల్లలు తల్లిదండ్రులకు, తమ ఇష్టదైవానికి నమస్కరిస్తున్న తీరు పట్ల, పిల్లల వ్యవహార శైలిలో వచ్చిన మార్పు పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

వైవిధ్యంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకత. గిరిజన సంస్కృతి, ఆచారాలు ప్రకృతి నుండి అనాదిగా పుట్టుకు వచ్చాయి. గిరిజనులు ప్రకృతిని, చెట్టును, పుట్టను పూజించే అనాగరికులు అంటూ కొందరు అవహేళన చేశారు.

గిరిజనులు తమ సంస్కృతిని పరిరక్షించుకుంటూనే ఆధునిక అభివృద్ధిని సైతం పొందగలిగేలా చేసే ప్రయత్నంలో భాగంగా సమరసతా సేవా ఫౌండేషన్ గిరిజన ధర్మ ప్రచారకులు వివిధ గిరిజన మండలాలలో పని చేస్తున్నారు. వారి ప్రయత్నం కారణంగా గతంలో నిర్వహించుకుని ప్రస్తుతం ఆగిన గిరిజన పండుగలను గిరిజనులు తిరిగి నిర్వహించుకోవడం మొదలైంది. అలాగే గిరిజన యువతీ యువకులు తమ సంస్కృతిలో భాగమైన గిరిజన పాటలను తిరిగి పాడుకుంటున్నారు.

అలాగే సుమారు 320 మండలాలలో మహిళా కార్యకర్తలు కూడా చురుగ్గా పని చేస్తున్నారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి రోగులను పరామర్శించి వస్తున్నారు. ఎస్సీ, ఎస్ టి, బిసి బాలికల వసతి గృహాలను సందర్శించి చదువు పట్ల వారిలో ఆసక్తి పెరిగే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నారు. సోదరి నివేదిత జయంతి, శారదా మాత జయంతి వంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా బాలికలలో త్యాగ భావనను, సేవా భావాన్ని, దేశభక్తిని, నైతిక విలువలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు.

22/ 1/ 2020 బుధవారం సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దాసరి శ్రీనివాసులు అధ్యక్షతన ఎస్ ఎస్ ఎఫ్ వార్షిక సమావేశం గుంటూరులో జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ స్వామీజీలు, మరియు పెద్దలు పాల్గొన్నారు.

సమరసతా సేవా ఫౌండేషన్ గత సంవత్సర కాలంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలు, మహిళా విభాగం పని, గిరిజన సంస్కృతి పరిరక్షణ, ధర్మ ప్రచార వేదిక చేపట్టిన వివిధ కార్యక్రమాల నివేదికలను పెద్దలందరికీ తెలియజేశారు. స్వామీజీలు, ఇతర పెద్దలు జరిగిన కార్యక్రమాల వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మొదటి దశలో ప్రయోగాత్మకంగా 102 చోట్ల చేపట్టిన బాలవికాస కేంద్రాలను మరింతగా విస్తరించాలని వారు ఆకాంక్షించారు. అలాగే ఇతర కార్యక్రమాలను కూడా మరింత మెరుగ్గా నిర్వహించడానికి అవసరమైన పలు సూచనలు చేశారు. ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రంలో హిందూ ధర్మానికి, ధర్మ ప్రచారానికి ఎదురవుతున్న సవాళ్లపై కూడా చర్చించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ చిన జీయర్ స్వామీజీ, శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ, శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతి స్వామీజీ, శ్రీ శ్రీ శ్రీ వాసుదేవానంద గిరి స్వామీజీ, శ్రీ శ్రీ శ్రీ ప్రణవానంద స్వామీజీ, శ్రీ శ్రీ శ్రీ శివ స్వామీజీ, శ్రీ శ్రీ శ్రీ విరజానంద స్వామీజీ, శ్రీ శ్రీ శ్రీ మాత శీలానందజీ, శ్రీ శ్రీ శ్రీ అహోబిల జీయర్ స్వామిజీ, శ్రీ శ్రీ శ్రీ కపిలేశ్వరానంద స్వామీజీ తదితర పూజ్య స్వామీజీలు పాల్గొన్నారు.

అలాగే రిటైర్డ్ డి జి పి డాక్టర్ కే అరవిందరావు, ప్రముఖ పాత్రికేయులు శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు డాక్టర్ కే ఉమామహేశ్వరరావు, డాక్టర్ పరశురాం,  శ్రీ గోపాలకృష్ణ, డాక్టర్ ముక్తేశ్వరరావు తదితర పెద్దలు, ప్రముఖులు పాల్గొన్నారు.

మధ్యాహ్నం జరిగిన సమావేశంలో జిల్లాల నుంచి విచ్చేసిన డివిజన్ ధర్మ ప్రచారకులు, డివిజన్ కన్వీనర్లు, మహిళా కన్వీనర్ లకు సమరసతా సేవా ఫౌండేషన్ భవిష్యత్ కార్యాచరణపై స్వామీజీలు, ప్రముఖులు మార్గదర్శనం చేశారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.