
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తిస్తున్న బార్క్ నకిలీ శాస్త్రవేత్త కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బార్క్ శాస్త్రవేత్తనని చెప్పుకుంటున్న నిందితుడు అక్తర్ కుతుబుద్దీన్ హుస్సైన్‌ను ఇటీవల ముంబై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిందితుడిది ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ అని పోలీసులు గుర్తించారు. అతడి సోదరుడు అదిల్‌ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు
హుస్సైన్ సోదరులకు 1995 నుంచే అనుమానాస్పద రీతిలో వివిధ మార్గాల్లో నిధులు అందాయని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. మొదట్లో లక్షల్లో చెల్లింపులు జరిగాయని, ఆ తరువాత ఇవి కోట్లకు చేరుకున్నాయని కూడా గుర్తించారు. భారత న్యూక్లియర్ వ్యవస్థలకు సంబంధించి సీక్రెట్ సమాచారం చేర వేసినందుకు నిందితులు ఈ డబ్బులు పుచ్చుకున్నట్టు అనుమానిస్తున్నారు. అక్తర్‌కు చెందిన ఓ ప్రైవేటు బ్యాంకు అకౌంట్‌లో అనేక అనుమానాస్పద లావాదేవీలు బయటపడ్డాయి.
తానో సైంటిస్టు అని చెప్పుకున్నందుకు అతడిని 2004 దుబాయ్‌ను బహిష్కరించినట్టు కూడా వెలుగులోకి వచ్చింది. ఝార్ఖండ్‌లో తనకు తెలిసిన వారి ద్వారా ఆ సోదరులు పలు ఫేక్ ఐడీలను కూడా సమకూర్చుకున్నట్టు తెలిసింది. తమ పేరిట ఉన్న పలు బ్యాంకు అకౌంట్లను కూడా వారు క్లోజ్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఇద్దరికీ ఐఎస్ఐతో లింకు ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులిద్దరూ పాకిస్థాన్‌కు వెళ్లివచ్చినట్టు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తన ఐడీలు మార్చుకుంటూ అక్తర్ సీక్రెట్ జీవితాన్ని గడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వీటి సాయంతోనే విదేశీ పర్యటనలు చేశాడని అనుమానిస్తున్నారు. అరెస్టు సమయంలో అతడి నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్‌తో పాటు పాత బ్యాంకు అకౌంట్‌ల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నిందితులకు ఏయే మార్గాల్లో నిధులు వస్తున్నాయో తెలుసుకునేందుకు విస్తృత స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.





