NewsProgramms

అట్టహాసంగా సింహపురి వైద్య సేవా సమితి ‘‘బాలమేళా’’

22views

స్వరాజ్య సమరంలో వనవాసీ వీరుల త్యాగాలు, ధైర్య సాహసాలు భావితరాలకు ఆదర్శనీయమని ఆర్.ఎస్.ఎస్. ప్రాంత కార్యకారిణి సభ్యులు దువ్వూరు యుగంధర్ అన్నారు. వనవాసి సమాజాన్ని మిగిలిన సమాజం నుంచి వేరు చేసి దేశాన్ని బలహీనపరచటానికి, విభజించటానికి అనేక రకాలుగా కుట్రలు జరుగుతున్నాయని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తమకే ప్రత్యేకమైన సంస్కృతికి కాపాడుకోవాల్సిన బాధ్యత వనవాసీలపైనే ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని జయ భారత్ హాస్పటల్స్ వారి సింహపురి వైద్య సేవా సమితి నెల్లూరు నగరంలోని కస్తూరి దేవి గార్డెన్స్‌లో సెప్టెంబరు 29న బాలమేళ 2024 నిర్వహించింది. జిల్లాలోని 7 మండలాల నుంచి 50 బాల సంస్కార కేంద్రాల నుంచి దాదాపుగా 1200 మంది గిరిజన బాలబాలికలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హాజరైన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని దువ్వూరు యుగంధర్ ప్రసంగించారు. తమ పూర్వీకులను ఆదర్శంగా తీసుకుని వనవాసీలు దేశం కోసం, ధర్మం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

వనవాసీల అభివృద్ధి దిశగా సింహపురి వైద్య సేవా సమితి నిస్వార్థ సేవలు అభినందనీయమని ఐటీడీఏ పీవో పరిమళ తెలిపారు. వనవాసీల కోసం పది పడకల గిరిజన వైద్యశాలను అందుబాటులో ఉంచడమే కాక వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు బాల సంస్కార కేంద్రాలను ఏర్పాటు చేసి గత కొన్నేళ్లుగా సింహపురి వైద్య సేవా సమితి చేస్తున్న కృషి శ్లాఘనీయం అన్నారు. బాల మేళ 2024లో భాగంగా నిర్వహించిన సార్వజనికోత్సవంలో దేశభక్తి, సామాజిక, సాంస్కృతిక వైభవాన్నితెలుపుతూ బాలబాలికలు నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వనవాసి స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ బిర్సా ముండా, శ్రీమతి ద్రౌపది ముర్ముల ఏకపాత్రాభినయం విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సుఖదేవి స్వామి మహారాజ్,చౌటూరు వెంకటేశ్వర్లు, విశ్రాంత డిఐజీ శ్రీ జైన్, శ్రీ సాంబ శివ, శ్రీ మోదెం మల్లికార్జున్, శ్రీ వి. సుధాకర్ గారు, సింహపురి వైద్య సేవా సమితి ఉపాధ్యక్షులు బాలు సుబ్బారావు, ఆర్.ఎస్.ఎస్. విభాగ్ సంఘచాలకులు పి. రామదండు, డాక్టర్ సి.వి. సుబ్రహ్మణ్యం, నెల్లూరు జిల్లా సంఘ చాలకులు శ్రీ బయ్యా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

స్వారజనికోత్సవం కార్యక్రమానికి ముందు సంస్కార కేంద్రాల ఉపాధ్యాయులకు వై. సుధాకర రావుగారు ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు. కాలనీల్లో ఉండే చిన్నారులు తప్పనిసరిగా సంస్కార కేంద్రాలకు హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రతి నెలా బాలబాలికల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. బాల సంస్కార కేంద్రాల ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ శ్రీ నంబూరు సుబ్బారావు ఆధ్వర్యంలో బాలబాలికల తల్లిదండ్రులతో సమావేశం జరిగింది. బాల కేంద్రాల ద్వారా వచ్చిన మార్పులను ఈ సందర్భంగా తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన కార్యక్రమంలో విజ్ఞాన భారతికి చెందిన 30 మంది ఉపాధ్యాయులు స్వచ్చందంగా వడ్డన కార్యక్రమంలో పాల్గొన్నారు. భోజనాలనంతరం ఇస్కాన్ మందిరం పాలక వ్యవస్థ చైర్మన్ డాక్టర్ సుఖదేవ స్వామి మహారాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించిన హరేకృష్ణ భజన కార్యక్రమం ఆధ్యాత్మికతను పెంపొందించింది.