News

ఆర్ఎస్ఎస్ సాంఘిక్‌ను అడ్డుకోడానికి కేరళ పోలీసుల ప్రయత్నం

46views

కేరళలోని తిరువనంతపురంలో కల్లిక్కట్ గ్రామ పంచాయతీ స్టేడియంలో ఆదివారం నాడు సాంఘిక్ నిర్వహించుకోడానికి ఆర్ఎస్ఎస్ ఏర్పాట్లు చేసుకుంది. సాంఘిక్ అంటే ఒక మండలం, తాలూకా, జిల్లా లేదా రాష్ట్ర స్థాయిలోని ఆర్ఎస్ఎస్ శాఖలు అన్నీ కలిసి ఏర్పాటు చేసుకునే సమావేశం.

కేరళలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్థానిక స్వయంసేవకులు ముందుగానే పంచాయతీ అధికారుల నుంచి కార్యక్రమ నిర్వహణకు అనుమతి తీసుకున్నారు. అయినప్పటికీ పోలీసులు ఆ కార్యక్రమాన్ని నిలిపివేయడానికి వచ్చారు. సంఘ ప్రతినిధులు పంచాయతీకి చేసిన చెల్లింపుల రసీదును, పంచాయతీ మంజూరు చేసిన అనుమతికి సంబంధించిన పత్రాలను పోలీసులకు చూపించారు. ఐనా పోలీసులు ఆగలేదు. కార్యక్రమానికి ఇచ్చిన అనుమతిని పంచాయతీ ఉపసంహరించుకుందని, అందువల్ల సాంఘిక్ నిర్వహించకూడదనీ అడ్డుకున్నారు.

దానికి ప్రతిగా స్వయంసేవకులు పథసంచలనం నిర్వహించారు. స్టేడియం నుంచి కల్లిక్కట్ జంక్షన్ వరకూ మార్చ్‌ఫాస్ట్ చేసారు. పోలీసులు ఆ పథసంచలనానికి ముందూ వెనుకా వెంబడించారు. పథసంచలనం మొదలు పెట్టగానే వర్షం కూడా మొదలైంది. అయినా స్వయంసేవకులు ఆగలేదు. సంఘానికే సాధ్యమైన క్రమశిక్షణతో పథసంచలనం కొనసాగించారు.

పోలీసుల చర్యల వెనుక అధికార సిపిఎం, డివైఎఫ్ఐ హస్తం ఉందని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆరోపించారు. పంచాయతీ కార్యదర్శి అనుమతి ఉపసంహరించారని పోలీసులు చెప్పినప్పటికీ, నిజానికి అలాంటి సమాచారమేదీ స్వయంసేవకులకు అధికారికంగా అందలేదు. దాన్నిబట్టే, రాజకీయ నాయకులు చెప్పినట్లు పోలీసులు ఆడుతున్నారని ఇట్టే అర్ధమవుతోంది.

ఆర్ఎస్ఎస్ ఆవిర్భావ దినం విజయదశమి సందర్భంగా ఆ పండుగకు ముందు స్వయంసేవకులు ప్రతీ రాష్ట్రంలోనూ పలు కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ఆర్ఎస్ఎస్ వ్యతిరేక ధోరణి కలిగిన కేరళ వామపక్ష ప్రభుత్వం సంఘం నిర్వహించుకునే ప్రతీ చిన్న కార్యక్రమాన్నీ అడ్డుకోడమే లక్ష్యంగా పెట్టుకుంది. సహనం, భావప్రకటనా స్వేచ్ఛ, సమానత్వం తమ సొత్తు అని కబుర్లు చెప్పే కమ్యూనిస్టు సర్కారు నిజానికి హిందూ వ్యతిరేక ధోరణితో, హిందూ సంస్థల కార్యక్రమాలను అడ్డుకుంటూనే ఉంది.