ArticlesNews

మల్లన్నసేవలో మహాదేవి

23views

హైందవ జీవనవిధానంలో భగవంతునిపట్ల భక్తి, ఉద్యమ రూపానికి తీసుకెళ్లిన వారెందరో ఉన్నారు. తమ రచనలతో, పాటతో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్న మహిళలు కూడా చాలామంది ఉన్నారు. జీవితం ఎందుకు అంటే భగవద్దర్శనం కోసం అని తపించి భగవదాన్వేషణలో జీవిత మంతా గడపగల ధృడసంకల్పం, పట్టుదల మహిళలకు కూడా ఉంటాయని ప్రసిద్ధ వీరశైవ యోగుల్లో సమున్నతస్థానం కలిగిన కన్నడ కవత్రి అక్కమహాదేవి జీవితం నిరూపిస్తుంది. క్రీ.శ. 1130లో కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో ఉడుతడి ఆమె జన్మస్థలం. ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఆమె పుట్టింది. ఆమె తల్లిదండ్రులైన సుమతి, నిర్మలశెట్టి పరమభక్తులు. తల్లిదండ్రుల సంస్కారం పిల్లలు అందుకోవడమే నిజమైన వారసత్వమవుతుంది. పార్వతి అంశంతో ఆమె జన్మించిందని భావించిన తల్లిదండ్రులు ఆమెకు మహాదేవి అను పేరు పెట్టారు. చిన్నతనంలోనే ఆమెకు శివదీక్ష, పంచాక్షరి మహామంత్ర ఉపదేశం జరిగాయి. చిన్నపుడే ఆమెకు తీవ్ర వైరాగ్యం కలిగింది. బంగారు ఆభరణాలు ఆమెకు దిగటుగా అనిపించేవి. చందనం కన్నా విభూతిని, నగలకన్నా రుద్రాక్షమాలలను ధరించడం ఆమెకు యిష్టంగా ఉండేది. శ్రీశైలంలోని చెన్నమల్లికార్జున స్వామిని తన పతిగా భావించింది. ఆ స్వామికి పరమ భక్తురాలిగా జీవించసాగింది. పోడవాటి ఉంగరాల జుట్టుతో ఆమె ఎంతో అందంగా ఉండేది. అప్పట్లో ఊడుతడిని పాలిస్తున్న కౌశికుడు ఆమెను పెళ్లాడాలని ఆశపడ్డాడు. మహాదేవి అందుకు అంగీకరించలేదు. అధికారదర్పంతో ఆమె కుటుంబాన్ని రాజు భయపెట్టాడు. దాంతో మహాదేవి తాను పెట్టే షరతులకు అంగికరిస్తే పెళ్ళాడతానంది. రాజు అంగీకరించాడు.

రాజమందిరంలోకి ప్రవేశించిన మహాదేవి శివపూజ చేస్తూ గురుజంగములకు సేవ చేస్తూ సుఖభోగాల ఆలోచన లేకుండా శివారాధనలో కాలం గడపసాగింది. ఒకరోజు రాజు కౌశికుడు ఆమె వ్రతానికి భంగం కల్గించాడు. దాంతో తక్షణమే రాజమందిరాన్ని విడిచిపెట్టింది. పరివ్రాజకురాలిగా మారింది. తన పొడవాటి శిరోజాలతోనే శరీరం కప్పుకుంది. జీవితాంతం అలా కేశాంబరిగానే గడిపింది. కళ్యాణ పట్టనం వెళ్ళినప్పుడు అనుభవమంటపానికి అధిపతిjైున ప్రభుతదేవుడు ఆమెను పరీక్షలకు గురిచేశాడు. చివరకు ఆమె పవిత్రతను తెలుసుకుని అనుభవమంట ప్రవేశం కల్పించాడు. అక్కడ లింగాయత సంప్రదాయ సంస్థాపకుడైన బసవేశ్వరుడికి ఆమె పరమ శిష్యురాలైంది. అంతా ఆమెను అక్కగా భావించారు. అప్పటి నుంచి ఆమె అక్క మహాదేవిగా ప్రఖ్యాతురాలైంది. ఆధ్యాత్మిక అన్వేషణలో, యితర విషయాల్లో మహిళలపై విధించిన పరిమితులను ఆమె ఎంతమాత్రమూ అంగీకరించేది కాదు. భగవంతునికి బాహ్యాడంబ రాలకంటె ఆత్మ సంస్కరణ ఆరాధనకు అత్యుత్తుమ మార్గమని ఆమె భావించింది. ఆచరణకు తోడ్పడే చిన్న చిన్న సుభాషితాలు, పరమశివుని మీద భక్తి పాటలు వ్రాయడం పాడడం ద్వారా ఆమె ఓ విప్లం సృష్టించింది. ఆ పాటల్ని ‘వచనాలు’ అంటారు. పరమశివుని గురించి వ్రాసిన భక్తి పాటల్లో ప్రతి వచనమూ ఆమె ఆరాధ్యదైవమైన చెన్నమల్లిఖార్జున నామంతో ముగుస్తుంది.

ఆమె సంస్కృతంలోనూ, కన్నడంలోనూ పండితురాలు. ఆమె మల్లికార్జునుడిపై వ్రాసిన కృతులు అక్కమహాదేవి వచనములుగా ప్రసిద్ధికెక్కాయి. యోగాంగ త్రివిధి, సృష్ఠియవచన, అక్కగళపితికే, లాంటి ధార్మిక రచనలు ఆమె రచించినవే. కన్నడ సాహిత్యంలో ఇవి విశిష్టస్థానం కలిగివున్నాయి. చరమదశలో ఆమె మల్లికార్జునిడితో లింగైక్యం కావాలని భావించి కష్టపడి శ్రీశైలం చేరింది. ఆలయ సమిద గుహలో ఆమె వసించినట్లు కథనం. 36 ఏళ్ల వయసులో ఆమె శివసాయుజ్యం పొందింది. భగవంతుడొక్కడే పురుషుడు, భక్తులందరూ స్త్రీలే అనే మధురభక్తి భావనను కఠోర నియమం, సంకల్పం, సాధనలద్వారా అక్కమహాదేవి శివైక్యం చెంది సాధించింది. ఆమె పేరున శ్రీశైలంలో అక్కమహాదేవి గుహలున్నాయి. ఇవి లక్షల సంవత్సరాలక్రితమే సహజంగా ఏర్పడిన వంటారు. ఆమె కలంపేరు ‘చెన్నమల్లికార్జున’.

– హనుమత్‌ ప్రసాద్‌