News

అస్సాంలో ఘర్‌వాపసీ: సనాతన ధర్మంలోకి తిరిగొచ్చిన రెజీనా బేగం

40views

స్సాంలో ఓ ముస్లిం యువతి సనాతన ధర్మంలోకి తిరిగొచ్చింది. ఇస్లాంను వదిలిపెట్టి ఘర్‌వాపసీ అయింది. నగావ్‌లోని శ్రీశ్రీ జఖలబంధ సత్రంలో ఆ కార్యక్రమం సెప్టెంబర్ 23 సోమవారం నాడు జరిగింది. అర్చన, పూజ తదితర హిందూ సంప్రదాయాలను పూర్తి చేసుకుని ఆ యువతి హిందువుగా మారింది.

శ్రీశ్రీ దామోదర్ దేవ్‌గురు అనే సాధు గురువు బోధనలు విన్న యువతి హిందూమతంలోకి మారాలని నిర్ణయించుకుంది. జఖలబంధ సత్రం అధికారి జుగల్‌ చంద్రదేవ్ గోస్వామి ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. తాను ఇప్పటివరకూ సుమారు 1100 మందికి హిందూమతంలోకి తిరిగి రావడానికి సహకరించినట్లు ఆయన చెప్పారు.

ఇప్పుడు ఘర్‌వాపసీ అయిన యువతి పేరు రెజీనా బేగమ్. ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. రంగియా ఆమె స్వస్థలం. ‘‘ఆమె హిందువు కావాలనుకుంది. ఘర్‌వాపసీ కోసం నన్ను సంప్రదించింది. తను నా దగ్గరకు రాలేక నన్నే తన వద్దకు రమ్మని పిలుస్తూ ఫోన్ చేసింది. విశ్వహిందూ పరిషత్‌కు చెందిన ఒక మిత్రుడితో కలిసి నేను ఆమెను రంగియా గ్రామంలో కలిసాను. ఆమెను హిందూధర్మంలోకి ఆహ్వానించాను’’ అని చెప్పారు.

ఆ సందర్భంగా ముస్లిములు జుగల్ చంద్రదేవ్ గోస్వామిని వెంబడించారు. ‘‘మేము ఆ అమ్మాయిని కలవడానికి వస్తామని తెలుసుకున్న ముస్లిములు మమ్మల్ని వెంబడించారు. అదృష్టవశాత్తు మేము తప్పించుకోగలిగాం. తర్వాత నేను ఎందుకు రాలేదని ఆమె ప్రశ్నించింది. మాకు దారిలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయని ఆమెకు చెప్పాను. తను కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొందని చెప్పింది. అందుకే తనను తన ఇంటిలోనే కలుసుకోవాలని చెప్పింది. నేను ఆమెకు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పాను. న్యాయశాస్త్రంలో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఎక్కువ ఫార్మాలిటీస్ లేవని వివరించాను. ఆమె స్వచ్ఛందంగా అఫిడవిట్ ఇచ్చిన తర్వాతే ఘర్‌వాపసీ ప్రక్రియ ప్రారంభించాను’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

అలా రెజీనా ఇస్లాం మతాన్ని వదిలి సనాతన ధర్మాన్ని ఆశ్రయించింది. ఆమె ఘర్‌వాపసీని చట్టబద్ధం చేస్తూ సత్రం అధికారులు సర్టిఫికెట్ జారీచేసారు.