Programms

ఆ స్తంభాల్ని రక్షిత కట్టడాలుగా ప్రకటించాలి

5views

ప్రకాశం జిల్లా గిద్దలూరు–నంద్యాల రైలు మార్గంలో దిగువ మిట్టపల్లి– దొరవారిబావి మధ్య గల 137 సంవత్సరాల నాటి రైల్వే బ్రిడ్జి ఆనవాళ్లను కాపాడుకుని భవిష్యత్‌ తరాలకు అందించాలని పురావస్తు పరిశోధకుడు, కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ అండ్‌ అమరావతి (సీసీవీఏ), ప్లీచ్‌ ఇండియా సంస్థల సీఈవో, పురావస్తు పరిశోధకుడు డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. మొగల్రాజపురం మధుచౌక్‌ సమీపంలో ఉన్న సీసీవీఏ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది.

శివనాగిరెడ్డి మాట్లాడుతూ చరిత్రను కాపాడి భవిష్యత్‌ తరాలకు అందించడానికి సీసీవీఏ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం ప్రకాశం జిల్లాలో పర్యటించామన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో నంద్యాల–గిద్దలూరు మధ్య దిగువ మిట్టపల్లి సమీపంలో చలమ–బొగడల ప్రాంతాల మధ్య 2600 అడుగుల సముద్రమట్టంపై 800 మీటర్ల పొడవైన రైల్వే బ్రిడ్జిని నిర్మించటానికి బ్రిటన్‌లోని బర్నింగ్‌ హామ్‌ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి తెప్పించిన 420 టన్నుల ఇనుము వినియోగించి, స్థానిక కార్మికులతోనే బ్రిటిష్‌ ఇంజినీర్లు ఈ రైల్వే బ్రిడ్జిని తయారు చేశారని శివనాగిరెడ్డి తెలిపారు.

1884లో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించి 1887లో పూర్తి చేశారన్నారు. ఇదే బ్రిడ్జి పైన 110 సంవత్సరాల పాటు రైళ్లు ప్రయాణించాయని చెప్పారు. 1992వ సంవత్సరంలో ఈ బ్రిడ్జిలో ఉన్న పట్టాలను తొలగించారని చెప్పారు. 137 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరారు. 200 అడుగుల ఎత్తున దిగువమిట్టపల్లి వద్ద గల రాతితో కట్టిన రైలు బ్రిడ్జి స్తంభాలు దొరవారిబావి వద్ద ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని, ఇటుక రాతి బ్రిడ్జి గోడల్ని రక్షిత కట్టడాలుగా ప్రకటించి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలన్నారు. ఆనాటి నిర్మాణ నైపుణ్యాన్ని ఈ తరానికి తెలిసేలా పర్యాటక శాఖ చర్యలు తీసుకుంటే యువత ఎంతో ఆసక్తిగా ఈ ప్రాంతాలను పరిశీలిస్తారని చెప్పారు. ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్‌ జ్యోతి చంద్రమౌళి, స్థానికుడు పాములపాటి శ్రీనాథ్‌ రెడ్డితో కలిసి ఈ బ్రిడ్జిని సందర్శించానని శివనాగిరెడ్డి తెలిపారు.