News

శ్రీవారిని దర్శించుకోవాలంటే సంప్రదాయాలు పాటించాల్సిందే: శ్రీనివాసానంద సరస్వతి

12views

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘జగన్‌ ఏనాడైనా ఆయన సతీమణిని శ్రీవారి దర్శనానికి తీసుకొచ్చారా? మన ఇంట్లో పూజ చేస్తేనే పక్కన భార్య ఉండేట్లు చూసుకుంటాం. హిందువుల మనోభావాలు, విశ్వాసాలను ఆయన ఏనాడూ గౌరవించలేదు. హిందుత్వానికి కష్టమొచ్చింది.. అందరం ఒక్కటై కాపాడుకోవాలి. తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్ని వైకాపా ప్రభుత్వం ఎప్పుడూ కాపాడలేదు. గత ఐదేళ్లలో ఎన్నో పాపాలు జరిగాయి.. ప్రక్షాళన జరగాల్సిందే. ఏనాడైనా డిక్లరేషన్‌పై జగన్‌ సంతకం చేశారా? ఆలయాలు, పూజారులపై దాడులు జరిగినా ఏనాడూ స్పందించలేదు.

ఐదేళ్లలో అనేక అఘాయిత్యాలు జరిగాయి. భయానక వాతావరణం సృష్టించారు. ఇలాంటి వాళ్లు తిరుమల క్షేత్రానికి వస్తున్నారంటే జాగ్రత్తగా ఉండాల్సిందే. సనాతన పరిరక్షణ బోర్టు ఏర్పాటు కావాలి. దీనికి రాజకీయ పక్షాలన్నీ సహకరించాలి. జగన్‌, వైకాపాపై మాకు వ్యక్తిగత ద్వేషం లేదు. ఆలయాల సంప్రదాయాలను గౌరవించకపోవడాన్ని తప్పు పడుతున్నాం. డిక్లరేషన్‌ ఇచ్చేందుకు అభ్యంతరమేంటి? తిరుమల పర్యటనలో కోడికత్తి నాటకాలాడతారని అనుమానాలున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నిస్తారనే అనుమానం కలుగుతోంది. గత ఐదేళ్లలో తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారు. తమ కుటుంబ సభ్యులను పాలకమండలిలో నియమించుకుని అక్రమాలు చేశారు. తిరుమలను శాంతియాగం, ప్రోక్షణతో పవిత్రం చేశారు. జగన్‌ పర్యటనతో మళ్లీ అపవిత్రమవుతుంది. ఇక్కడికి వచ్చి మరింత క్షోభకు గురిచేయవద్దు’’ అని శ్రీనివాసానంద సరస్వతి వ్యాఖ్యానించారు.