News

మథురలో ఇక ప్రాచీన ప్రసాద వితరణే

12views

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో గల దేవాలయాల్లో ఇకపై భక్తులకు బహిరంగ మార్కెట్‌లో తయారయ్యే స్వీట్ల స్థానంలో ‘ప్రాచీన ప్రసాదం’ వితరణ చేయాలని స్థానిక హిందూ సంస్థ నిర్ణయించింది. ఆ ప్రకారం ఆయా కాలాల్లో వచ్చే పళ్లు, పూలు, అయిదు రకాల ఎండు ఫలాలతో కూడిన పంచమేవ, యాలకులు, చక్కెర మిఠాయిలను భక్తులకు పంచుతారు. బృందావన్‌లో బుధవారం జరిగిన సమావేశంలో ధర్మ రక్షా సంఘ్‌ అధ్యక్షుడు సౌరభ్‌ గౌర్‌ మాట్లాడుతూ..‘‘దేశ వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రసాదం వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలి. సంప్రదాయ హిందూ పద్ధతిలో స్వచ్ఛమైన, సాత్విక ప్రసాదం వితరణను పునరుద్ధరించాలన్న అంశంపై మత పెద్దలు, సంస్థల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది’’అని పేర్కొన్నారు.

కొబ్బరికాయలు, పళ్లే తీసుకురండి
దేవాలయాలకు దుకాణాల నుంచి తెచ్చే స్వీట్లు, శుద్ధి చేసిన ఆహార పదార్థాలను భక్తులు తీసుకురావడంపై ప్రయాగ్‌రాజ్‌లోని దేవాలయాలు నిషేధం విధించాయి. బదులుగా కొబ్బరికాయలు, పళ్లు, ఎండుఫలాలను మాత్రమే నైవేద్యంగా సమర్పించేందుకు తీసుకురావాలని సూచించాయి. ఈ మేరకు ప్రముఖ అలోప్‌ శాంకరీ దేవి, బడే హనుమాన్, మన్‌కామేశ్వర్‌ దేవాలయాలు ప్రకటించాయి. దేవాలయ యాజమాన్యం నిర్వహించిన సమావేశంలో ఇకపై అమ్మవారికి స్వీట్లను నైవేద్యంగా పెట్టరాదని నిర్ణయించినట్లు ప్రయాగ్‌రాజ్‌లోని ప్రఖ్యాత లలితా దేవి ఆలయ ప్రధాన పూజారి శివ మురత్‌ మిశ్ర వెల్లడించారు.