News

స్వచ్ఛ భారత్ లో దేశవ్యాప్త గుర్తింపు సాధించిన నరసాపురం మహిళ

16views

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం పొన్నపల్లి వార్డులోని సత్యనారాయణమ్మ పరిశుభ్రత విషయంలో చేసిన ప్రయత్నాలు స్వచ్ఛ భారత్‌ దృష్టిని ఆకర్షించాయి. దివ్యాంగురాలైన ఆ మత్స్యకార మహిళ ఇద్దరు పిల్లల తల్లి. స్వచ్ఛభారత్‌ దిశగా వేసిన అడుగులు పొన్నపల్లి వార్డుకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.

ఒకప్పుడు బహిరంగ మలవిసర్జనతో అపరిశుభ్రంగా ఉన్న పొన్నపల్లి వార్డు ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ప్రయత్నాలు విజయం సాధించాయి. దీంతో పొన్నపల్లి వార్డు బహిరంగ మలవిసర్జన రహిత (ఓడిఎఫ్‌) హోదాను సాధించింది, సత్యనారాయణమ్మ తన కుటుంబానికి మాత్రమే కాకుండా మొత్తం వార్డు పరిశుభ్రతకు నడుం బిగించింది. మహిళల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై అవగాహన పెంచడానికి అంకితమైన స్థానిక ఎన్‌జీఓ జెండర్‌ ఫోరంలో చేరడంతో సత్యనారాయణమ్మ ప్రయాణం ప్రారంభమైంది. ఇతర సభ్యులతో కలిసి, ఆమె రుతుక్రమ పరిశుభ్రత, టాయిలెట్‌ వాడకం, చేతులు కడుక్కోవడం వంటి కీలక అంశాల ప్రచారం కోసం చేపట్టిన చర్చలకు నాయకత్వం వహించింది.

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్వభావ స్వచ్ఛత సంస్కార్‌ స్వచ్ఛత ప్రచారానికి పొన్నపల్లి సత్యనారాయణమ్మ స్ఫూర్తిగా నిలిచారని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ తెలిపింది.