News

ఇప్పిలిలో పురాతన శిలాశాసనం

26views

శ్రీకాకుళం జిల్లాలోని ఇప్పిలి గ్రామంలో పురాతన శిలాశాసనం బయల్పడింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పర్యాటకాధికారి కె.నారాయణరావు అక్కడకు చేరుకున్నారు. ఈ వివరాలను పురావస్తుశాఖ అధికారులకు అందజేశారు. కళింగ రాజ్యాన్ని 63 ఏళ్లు నిరాటంకంగా పరిపాలించిన తూర్పుగంగ చక్రవర్తి చోడ గంగదేవుని కాలానికి సంబంధించిన కొత్త తెలుగు శిలాశాసనంగా గుర్తించారు. ఇప్పిలిలో ఉన్న కరంజీశ్వర స్వామి ఆలయంలో అఖండ దీపం వెలిగించడానికి కావాల్సిన నెయ్యి కోసం స్థానిక రేవినాయకుడు, 9 మాడల నగదును (అప్పుడు చెలామణిలో ఉన్న నాణేలు) దానం చేసిన సందర్భంగా క్రీస్తు శకం, 1137 ఆగస్టు 17న బుధవారం ఈ శాసనం వేసినట్లు కేంద్ర పురావస్తుశాఖ శాసనవిభాగ సంచాలకుడు కె.మునిరత్నం రెడ్డి తెలిపారు. ఇప్పిలి చారిత్రక ప్రాధాన్యత కలిగిన గ్రామమని, ఆ గ్రామంలో కరంజీశ్వర (శివునికి అంకితమైన) ఒక దేవాలయం ఉండేదని పురావస్తు పరిశోధకుడు డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఆ దేవాలయం రూపురేఖలు మారి ఆధునీకరించబడిందని, అప్పటి శిల్పాలు ఇప్పటికీ అలనాటి చరిత్రకు ఆనవాళ్లుగా మిగిలి ఉన్నాయని చెప్పారు. వాటిని కాపాడుకుని భవిష్యత్తరాలకు అందించాలని గ్రామస్థులకు, జిల్లా యంత్రాంగానికి ఆయన విజ్ఞప్తి చేశారు.