ArticlesNews

సమభావనా కేతనం శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం

21views

( సెప్టెంబరు 26 – చిలకమర్తి లక్ష్మీ నరసింహం జయంతి )

భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై యేడ్చుచుండ పద్యము జాతీయోద్యమ సమయంలో ప్రతి తెలుగువాని నోట వందేమాతర గీతంలా ప్రతిధ్వనించింది. ఈ పద్యాన్ని చెప్పి బ్రిటీషు ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది మరెవరో కాదు ‘ఆంధ్రా మిల్టన్’‌గా ప్రసిద్ధికెక్కిన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారు. ఎప్పుడో 1905లో చిలకమర్తివారు చెప్పిన ఈ పద్యం వింటే నేడు కూడా ఒళ్లు గగుర్పొడుస్తుంది. నాటకకర్తగా, నవలా రచయితగా, సంఘ సంస్కర్తగా ఆంధ్రుల మనసులు దోచుకున్న ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో రత్నమ్మ, వెంకయ్య దంపతులకు 1867 సెప్టెంబరు 26న జన్మించారు. వీరవాసరం, నరసాపురంలో ప్రాథమిక విద్యను, 1889లో రాజమండ్రి హైస్కూలులో పట్టా పుట్టుకున్న చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు రాజమండ్రి ఆర్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించారు.

చిలకమర్తి నరసింహంగారు నిరుపమాన సాహిత్యవ్రతుడుగా తెలిసినంతగా సంఘ సంస్కారాభిమానిగా ఎక్కువమందికి తెలియదు. 1899లో హిందూ లోయర్ సెకండరీ స్కూల్‌ను స్థాపించి తొమ్మిది సంవత్సరాలు నడిపారు. ఆ తరువాత కందుకూరి వీరేశలింగం పంతులుగారు కోరగా, అన్ని పరికరాలతో సహా ఆ స్కూలును వారికి అప్పగించారు. అదే అనంతర కాలంలో హితకారిణి పాఠశాలగా నడిచింది. మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ భారతదేశానికి వచ్చి హరిజనోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టకపూర్వమే 1907లో రామమోహన పాఠశాలను ఏర్పాటు చేసి హరిజనులకు విద్యాబోధన సాగించారు. వారికి ఉచితంగా పుస్తకాలను అందించడంతో పాటు ఆంగ్ల భాషను కూడా బోధించారు. వయోజన విద్యకు సైతం ఆయనే ఆద్యులు. వయోజనుల కోసం ‘వివేకానంద రాత్రి పాఠశాల’ను 1916లో ప్రారంభించి ఒక హరిజనుడిని అధ్యాపకునిగా నియమించి రాత్రిపూట పాఠాలు చెబుతూ ఎందరికో అక్షరజ్ఞానం ప్రసాదించారు.

చిలకమర్తివారు సంఘసేవతో పాటు ‘దేశమాత’, ‘మనోరమ’, ‘సరస్వతి’ వంటి పత్రికలను స్థాపించి వాటిని సాంఘిక, రాజకీయ చైతన్య అస్త్రాలుగా వినియోగించి ప్రజలను స్వాతంత్ర్యోద్యమ బాట పట్టించారు. అంతేకాక వారిని, సంఘంలోని దురాచారాల నిర్మూలన దిశగా ప్రేరేపించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఆ రోజుల్లో పత్రికలకు పెద్ద మొత్తాల్లో చందాలు ఇచ్చి వాటిని తమ చెప్పుచేతల్లో ఉంచుకునేవారు. దేశమాత పత్రికకు కూడా సంవత్సరానికి 9 వేల రూపాయలు సబ్సిడీ ఇస్తామని ప్రలోభ పెట్టారు. ధనము కోసం బానిసగా ఉండుట ఇష్టము లేదని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ప్రతిపాదనను తిరస్కరించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చే బిరుదులు, ఆదర సత్కారాలకు లొంగని స్వాతంత్ర్య ప్రేమికుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు.

చిలకమర్తివారు పత్రికా నిర్వహణతో పాటు పలు నవలలు, నాటకాలు, పద్యరచనలు, జీవిత చరిత్రలు, ప్రహాసనాలను కలుపుకుని 100కి పైగా రచనలు చేశారు. వీరి నాటకాలలో గయోపాఖ్యానము ఎంతో ప్రాచూర్యం పొందింది. ఆయన రచించిన గణపతి నవల కూడా బహుళ ప్రచారం పొందింది. చిలకమర్తివారు తన 30వ ఏట రేచీకటి వ్యాధికి గురైనా ఏమాత్రం బెదరకుండా తన కంటిచూపునకు ఉన్న అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించారు. ఛాందసుల మీద, డాంబికుల మీద, మూఢ విశ్వాసాల మీద, మద్యపానం పైన కేంద్రీకృతమైన వీరి ప్రహసనాలు లలితంగా, హాస్యప్రధానంగా ఉండేవి. సమకాలీన సమాజంలోని చెడును తన నాటకాలలోని పాత్రల ద్వారా విమర్శిస్తూ ప్రేక్షకులను సన్మార్గం వైపు నడిపించిన సాహిత్యవ్రతుడు, దేశభక్తుడైన చిలకమర్తివారు 1946 జూన్ 17వ తేదీన తన 79వ ఏట కన్నుమూశారు. పాఠశాల నడిపినా, పత్రిక నడిపినా, రచనా వ్యాసంగంలో నవల, నాటకం, పద్యం, గద్యం..ఇలా ప్రక్రియ ఏది నెరిపినా సామాన్యతలోనే ధీమాన్యతను ప్రదర్శించిన చిలకమర్తి నరసింహంవారిని 1943లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది. సమకాలీన సామాజిక పరిణామాల ఎగుడుదిగుడులను సునిశిత పరిశీలకుడైన చరిత్రకారుడుగా తన రచనల్లో చేర్చిన చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు తెలుగువారి జోహార్లకు సదా పాత్రులు.