News

హోటళ్లలో యజమానుల పేర్లు ప్రదర్శించాలి

39views

తిరుపతి వెంకన్న ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. ఇప్పటికే ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ప్రసాదానికి వినియోగిస్తున్న నెయ్యి నాణ్యతను పరీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక పట్టణాలు మధుర, బృందావన్‌లోని స్వీట్ దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసి.. స్వీట్ శాంపిళ్లను పరీక్షించేందుకు ల్యాబ్‌లకు పంపారు.

అలాంటి వేళ హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, తినుబండారాల విక్రయశాలల్లో యజమాని పేరు, ఫొన్ నెంబర్‌తోపాటు అతడి చిరునామా.. తప్పని సరిగా కస్టమర్లకు కనిపించేలా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిమ్లాలో జరిగిన రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరహాలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ అంశంపై ఇటీవల అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పటానియా.. ఏడుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మంత్రులు విక్రమాదిత్య సింగ్‌తోపాటు అనిరుధ్ సింగ్‌లకు సైతం స్థానం కల్పించారు. ఆ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. హాకర్లకు గుర్తింపు కార్డుల జారీతో సహా పటిష్టమైన చట్టాలు తీసుకు వస్తున్నట్లు మంత్రి విక్రమాదిత్య సింగ్ ఈ సమావేశ అనంతరం వెల్లడించారు. తిరుపతి లడ్డూ విషయం వివాదాస్పదం కావడంతో.. ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లు ఆహార నియంత్రణ చట్టాలను పటిష్టం చేస్తున్న విషయం విధితమే.