ArticlesNews

దంపతుల విరాళం.. కన్నయ్యకు దివ్యాలయం

50views

ఆ దంపతులు మలిసంధ్యవేళ మంచి నిర్ణయం తీసుకున్నారు. డబ్బు ఉన్నా.. సాయం చేసే మనసు అందరికీ ఉండదు. అలాగని వీరికి కోట్ల ఆస్తులేమీ లేవు. కానీ సాయం చేయాలనే మనసు ఉంది. తండ్రి వారసత్వంగా వచ్చిన కొంత పొలం తప్ప ఇతర ఆదాయ మార్గాలేవీ లేవు. వయసు మీదపడింది. ఊరికి ఏదో మంచి చేయాలని సంకల్పించారు. ఆలయ నిర్మాణానికి లక్షలు విరాళంగా ఇచ్చారు. గ్రామంలో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు వృద్ధ దంపతులు మాలగొండ రోశన్న, జయమ్మ దంపతులు.

ఏళ్ల తరబడి ఎదురు చూపులు
రోశన్న, జయమ్మ దంపతులకు వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఉన్న ఎనిమిదెకరాల్లో ఐదెకరాల పొలాన్ని రూ.90 లక్షలకు విక్రయించారు. వచ్చిన దాంట్లో గ్రామంలో శ్రీకృష్ణాలయ నిర్మాణానికి రూ.65 లక్షల విరాళం అందించారు. వారు అందించిన భూరి విరాళంతో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. హోసూరులో వారి ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణాలయం నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆర్థిక వనరులు సమకూరక ఇబ్బందులు పడుతున్న యాదవ సంఘం పెద్దలకు తామున్నామని ముందుకొచ్చారు వృద్ధ దంపతులు.

ఎన్నో ఏళ్ల కల నెరవేరుతోంది
ఎన్నో ఏళ్లుగా గ్రామంలో శ్రీకృష్ణుడి ఆలయం నిర్మించాలని సంఘం పెద్దలు అనుకుంటున్నారు. అది కార్యరూపం దాల్చలేదు. ఆలయ నిర్మాణం అంటే రూ.లక్షల్లో వ్యవహారం. వారు వీరు ఇచ్చే వేల రూపాయలు ఏ మూలకూ సరిపోవు. ఎన్ని ఆస్తులున్నా, ఎంత డబ్బు ఉన్నా ఎవరూ వెంట తీసుకెళ్లలేరు. గ్రామంలో ఓ ఆలయం రూపుదిద్దుకొని, ఆధ్యాత్మి భావాలు పెంపొందుతాయంటే.. అంతకన్నా మానసిక ఆనందం ఏముంటుంది. అందుకనే నా భార్య జయమ్మతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం.– మాలగొండ రోశన్న, జయమ్మ, దాతలు

భూమిని నమ్ముకొనే జీవనం
కర్నూలుజిల్లా పత్తికొండ మండల పరిధిలోని హోసూరు గ్రామానికి చెందిన మాలగొండ రోశన్న, జయమ్మ దంపతులకు సంతానం లేదు. రోశన్నకు ఉన్న ఇద్దరు సోదరులు వేరువేరుగా ఉంటారు. వారి భాగానికి వచ్చిన 12 ఎకరాల పొలాన్ని నమ్ముకొని ఇన్నాళ్లూ జీవనం సాగించారు. ప్రస్తుతం ఏడు పదుల వయసులో ఉన్న ఈ దంపతులు ఏ పనీ చేయలేక పోతున్నారు. కొన్నేళ్లు భూమిని కౌలుకు ఇచ్చి వచ్చిన డబ్బుతో కాలం గడుపుతున్నారు. కొంత కాలంగా ఇద్దరినీ జబ్బులు వెంటాడుతున్నాయి. చికిత్స నిమిత్తం రూ.లక్షలు ఖర్చు చేశారు. మధ్యలో కొంత పొలాన్ని అమ్మి అప్పులు తీర్చారు. ఇటీవల మరికొంత అమ్మగా వచ్చిన సొమ్ములో కొంత వారితో ఉంచుకొని రూ.65లక్షలకు పైగా ఆలయ నిర్మాణానికి విరాళం అందజేశారు. శిథిలావస్థకు చేరిన తమ సొంత ఇంటిని సైతం మరమ్మతులు చేసుకోకుండా ఆలయ నిర్మాణానికి విరాళం ఇచ్చి దాతృత్వం చాటుకున్నారు. భర్త రోశన్న తీసుకున్న నిర్ణయానికి భార్య జయమ్మ సైతం సుముఖత వ్యక్తం చేసి ఆదర్శ దంపతులుగా నిలిచారు. వృద్ధ దంపతులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం దాత రోశన్న దగ్గర ఉండి ఆలయ నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్నారు.