News

దైవదూషణ చేసాడని మతగురువుపై పాకిస్తానీల మండిపాటు, పరారీలో మౌలానా

118views

దైవదూషణకు మరణదండనే శిక్ష అంటూ గతంలో విరుచుకుపడిన ప్రఖ్యాత పాకిస్తానీ ఇస్లామిక్ పండితుడు మౌలానా తారిక్ మసూద్ ఇప్పుడు అదే దైవదూషణ ఆరోపణలతో పరారీలో ఉన్నాడు. ఒకప్పుడు, మహమ్మద్ ప్రవక్తని కానీ కురాన్‌ను కానీ అవమానించినవారిని తక్షణమే ఉరితీయాలి అంటూ రెచ్చగొట్టేలా ఉపదేశాలిస్తుండే ఈ మత ప్రబోధకుడు ఇప్పుడు తనే ఆ పని చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తనను ఎక్కడ చంపేస్తారో అన్న భయంతో గిలగిలలాడుతున్నాడు.

మౌలానా మసూద్ మాట్లాడిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటినుంచీ ఈ వివాదం రాజుకుంది. ఆ వీడియోలో అతను మహమ్మద్ ప్రవక్త గురించి, కురాన్ గురించీ కొన్ని వ్యాఖ్యలు చేసాడు. ఆ వ్యాఖ్యలు ముస్లిం మతఛాందసవాదులకు మంటెక్కించాయి. ‘‘మీరెందుకు నబీ(మహమ్మద్)ని అనుసరిస్తున్నారు? అతనికే చదవడం, రాయడం రాదు కదా…’’ అన్న మాటలతో ముస్లింలు మండిపడ్డారు. ఇంక కురాన్ గురించి కూడా మౌలానా మసూద్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘‘కురాన్‌ చెప్పిన మహమ్మద్‌కి ఒక్క పదమైనా రాయడం రాదు, అతను వేరేవారితో రాయించుకునేవాడు. దానివల్ల కురాన్‌లో వ్యాకరణ దోషాలు చొరబడ్డాయి. అలాంటి తప్పులు ఉన్నాయని మహమ్మద్‌కు తెలియదు, కాబట్టి ఎటువంటి దిద్దుబాట్లూ చేయలేదు. దాంతో ఆ తప్పులు ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి’’ అంటూ మౌలానా మసూద్ కురాన్‌లో దోషాల గురించి వివరించాడు.

ఆ వ్యాఖ్యలపై పాకిస్తాన్ దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చాలామంది మౌలానా మసూద్ దైవదూషణకు పాల్పడ్డాడంటూ మండిపడ్డారు. దైవదూషణకు పాకిస్తాన్‌లో మరణశిక్ష విధించేలా చట్టాలున్నాయి. ఇదే పండితుడు గతంలో ఆ చట్టాలను సమర్ధిస్తూ దైవదూషణకు పాల్పడిన వారికి తక్షణమే మరణ శిక్ష అమలు చేయాల్సిందేనని వాదించాడు. దానికి కోర్టుల్లో విచారణలు అక్కర్లేదని ప్రజలను రెచ్చగొట్టేవాడు.

ఇప్పుడు సరిగ్గా అవే ఆరోపణలు తనమీద వచ్చేసరికి మౌలానా మసూద్ వైఖరి మారిపోయింది. దైవదూషణకు క్షమాపణ ప్రసక్తే లేదని గొంతు చించుకుంటుండే మౌలానా, ఇప్పుడు తన కిందకి నీళ్ళు వచ్చేసరికి క్షమాపణ గురించి తన వైఖరే మార్చేసుకున్నాడు. తనను అర్ధం చేసుకోవాలనీ, క్షమించాలనీ, తన మాటలను వక్రీకరించారనీ ఇలా రకరకాల సాకులు చెబుతూ తనను ఏమీ చేయవద్దని వేడుకుంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేసాడు. ఇస్లాంలో మూడు పద్ధతుల్లో క్షమాభిక్ష పెట్టవచ్చని చెబుతూ, తను నిజాయితీగా పశ్చాత్తాప పడుతున్నానని చెప్పుకుంటూ తనను క్షమించమని అభ్యర్ధిస్తున్నాడు.

అయితే పాకిస్తానీ ప్రజలు ఆ అభ్యర్ధనలను పట్టించుకోవడం లేదు. గతంలో అతనే చేసిన ప్రసంగాలను వినిపిస్తున్నారు. ‘‘క్షమాపణ అడిగేవారు సైతం శిక్ష నుంచి తప్పించుకోలేరు. ఎందుకంటే అటువంటి అభ్యర్ధన అతని హృదయం నుంచి కాదు, నోటిపైనుంచే వస్తుంది. అందువల్ల క్షమాపణ అడిగినప్పటికీ దైవదూషణ చట్టం ప్రకారం శిక్షించాల్సిందే’’ అని మౌలానా మసూద్ గతంలో చెప్పిన వివరణలను చూపిస్తున్నారు.

నష్టనివారణకు మౌలానా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. అతని పరిస్థితి ప్రమాదకరంగానే ఉంది. పాకిస్తాన్ వీధుల్లో అతని పట్ల అశాంతి పెరుగుతోంది. కోపంగా ఉన్న మూకలు, గతంలో అతనే ఊదరగొట్టిన చట్టాల ప్రకారం అతన్నిప్పుడు కఠినంగా శిక్షించాల్సిందేనంటూ మండిపడుతున్నాయి. మసూద్ అజ్ఞాతంలో ఉంటూనే తన వ్యాఖ్యల గురించి వివరణలు, క్షమాపణల వీడియోలు చేసి విడుదల చేస్తున్నాడు. పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నాడు.