News

రాములవారి ఆలయ రథానికి నిప్పు ఘటన.. వ్యక్తి అరెస్ట్‌

56views

అనంతపురం హనకనహాళ్‌లో రాములవారి ఆలయ రథానికి నిప్పు పెట్టిన ఘటన కేసును ఛేదించామని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్‌ తెలిపారు. ఈశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి రథానికి నిప్పు పెట్టినట్లు గుర్తించామన్నారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు.

‘‘ఈనెల 23న ఆలయ రథానికి నిప్పు పెట్టారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు 24 గంటల్లో కేసును ఛేదించాం. ఎర్రిస్వామిరెడ్డి సోదరులు రూ.20లక్షలు వెచ్చించి 2022లో రథం చేయించారు. దీనికోసం గ్రామస్థుల నుంచి ఎలాంటి విరాళాలు సేకరించలేదు. ఈ విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో జరిగిన గొడవతో రథానికి ఎర్రిస్వామిరెడ్డి కుమారుడు ఈశ్వర్‌రెడ్డి నిప్పుపెట్టాడు. అర్ధరాత్రి పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టినట్లు విచారణలో అంగీకరించాడు. అతడు ప్రస్తుతం వైకాపా కార్యకర్త.. అయితే దీనిలో రాజకీయ కోణం లేదు. రథానికి నిప్పు అంశంలో మరేవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఈశ్వర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశాం’’ అని ఎస్పీ తెలిపారు.

కణేకల్లు మండలం హనకనహాళ్‌లోని ఆలయ రథానికి సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడం కలకలం రేపింది. షెడ్డులో మంటలు, పొగ వ్యాపించడంతో స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పివేశారు. అప్పటికే రథం కొంతమేర కాలిపోయింది.