News

చిత్తూరు జిల్లాలో దేశీ ఆవుల అక్రమ రవాణా

24views

గోమాత కన్నీరు పెడుతోంది. దేశీరకం పెద్దఎత్తున కబేళాకు తరలుతోంది. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు వాటిని పోషించలేక అందినకాడికి విక్రయించేస్తున్నారు. కేరళ రాష్ట్రంలో వాటి మాంసానికి గిరాకీ ఉండటంతో వ్యాపారులు ఆదాయవనరుగా మార్చుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాకుండా అనంతపురం నుంచి పెద్దఎత్తున తమిళనాడు అట్నుంచి కేరళకు రవాణా చేస్తున్నారు.

అటవీ సమీప గ్రామాల్లో..
చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం అటవీ సమీప గ్రామాల్లో మాత్రమే దేశీ ఆవులు కనిపిస్తున్నాయి. వీటికోసం పెద్దగా ఖర్చుపెట్టకపోయినా రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల పాలు ఇస్తుంటాయి. ఉదయం అడవిలోకి వదిలేస్తే సాయంత్రానికి మేతమేసి వస్తుంటాయి. వర్షాకాలంలో చెరువులు, పచ్చిక బీళ్లలో ఇవి ఆహారాన్ని పొందుతాయి. ప్రస్తుతం వర్షాలు పెద్దగా కురవకపోవడంతో వీటి పరిరక్షణ కష్టంగా మారింది. పచ్చగడ్డి కొనుగోలు చేస్తే ఏమాత్రం గిట్టుబాటు కాని పరిస్థితి. రైతులు పాల కోసం జర్సీ, హెచ్‌ఎఫ్‌ ఆవులను ఎక్కువగా పోషిస్తున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు దేశీయ ఆవుల కోసం కాపుకాచి వారపు సంతల్లో కొనుగోలు చేస్తుంటారు. పలమనేరు, పుంగనూరు వారపు సంతల్లో రైతులు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. వీటిని ప్రభుత్వం సంరక్షించకుంటే భవిష్యత్తులో వీటి ఆనవాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

చట్టాలు చుట్టాలుగా మారి
ప్రతియేటా దేశీయ ఆవుల సంఖ్య 5 నుంచి 6 శాతం తగ్గిపోతోంది. జంతు సంరక్షణ చట్టం ప్రకారం పశువులను వాహనాల్లో తరలించరాదు. అయితే ఇవేవీ పట్టించుకోకుండా వ్యాపారులు పూర్తిగా టార్పాలిన్లు కప్పి కంటైనర్లు, లారీల్లో తరలిస్తున్నారు. గతంలో పోలీసులు పశువుల రవాణా మీద దృష్టిపెట్టేవారు. పశువులను పట్టుకుంటే ఎక్కడ ఉంచాలి.. మేత ఎలా అన్న విషయంలో ఇబ్బందులు ఎదురవడంతో పట్టించుకోవడంలేదు. పట్టణానికి సమీపంలోని ఒక గిడ్డంగిలో పశువుల మాంసానికి సంబంధించిన ఎముకలు నిలువ చేసేవారు. దానిపై పట్టణ వాసులు ఇటీవల మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. పశుమాంసం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నందున నాటు ఆవులే కాకుండా ఆ జాతికి చెందిన కోడెదూడలను సైతం మాంసానికి విక్రయిస్తున్నారు.

ప్రత్యేక దృష్టి సారిస్తాం
పశువుల రవాణా విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఎవరైనా సరే తమకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం -ప్రభాకర్, డిఎస్పీ, పలమనేరు