ArticlesNews

సామాన్య జన ప్రవక్త, గొప్ప సంఘ సంస్కర్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు

49views

( ఆగష్టు 19 – శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధనోత్సవాలు )

ప్రపంచంలో ఏ వింత జరిగినా బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు నేటికీ గుర్తుకు తెచ్చుకుంటారు. పోతులూర వీరబ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. బ్రహ్మంగారు కేవలం కాలజ్ఞాన ప్రభోదకర్త మాత్రమేనా..కానేకాదు, సాక్షాత్ దైవ స్వరూపుడు అయిన బ్రహ్మంగారు రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానంలో సుస్పష్టంగా వివరించి, జనులందరినీ సన్మార్గములో నడువమని బోధించిన మహిమాన్వితుడు. తన తత్వాల ద్వారా ఇతర రచనల ద్వారా సామాజిక విప్లవాన్ని సాధించిన యోగీశ్వరులు. సమాజంలోని మూఢ విశ్వాసాలను ఖండిస్తూ..అజ్ఞానంలో మగ్గిపోతున్న మానవాళికి జ్ఞానోదయాన్ని కలిగించిన జ్ఞానజ్యోతి. కుల, మత, వర్గ వర్ణాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు వాస్తవికతను తెలియజేసిన బ్రహ్మంగారు హిందూ ధర్మ పరిరక్షకులు కూడా..

శ్రీ మద్విరాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు క్రీస్తు శకం 1608 స్వస్తి శ్రీ చంద్రమానేన కీలక నామ సంవత్సర కార్తీక మాసశుద్ధ ద్వాదశినాడు జన్మించారు. వీరి తండ్రి పోతులూరి పరిపూర్ణయాచార్యులు. తల్లి శ్రీపోతులూరి ప్రకృతాంబ. బ్రహ్మంగారిని పెంచి పెద్ద చేసిన వారు శ్రీ వీరభోజయాచార్యులు, శ్రీమతి వీరపాపమాంబగారు. అతిచిన్న వయసులోనే కాళికాంబ పై సప్తశతి రచించి అందరిని అబ్బుర పరచిన బ్రహ్మంగారు తన 11వ ఏట దేశాటనకు బయలుదేరారు. పెంచిన మమకారంతో తల్లి అడ్డుపడితే ఆమెకు జ్ఞాన బోధ చేసి అనంతరం ఆమె అనుమతితో దేశాటనకు బయల్దేరారు. అలా కర్నూలు జిల్లాలోని బనగానపల్లెకు చేరుకునే సమయానికి బ్రహ్మంగారి వయసు కేవలం 15ఏళ్లు మాత్రమే..

బ్రహ్మంగారు బనగానపల్లెలో అచ్చమ్మ ఇంట గోవుల కాపరిగా చేరారు. గోవులను సమీపంలోని రవ్వలకొండకు తీసుకెళ్లి ఒక గిరి గీయగా అవి ఆ గిరిలోనే మేత మేస్తుండేవి. బ్రహ్మంగారు అక్కడే కాలజ్ఞానం వ్రాయటం ప్రారంభించారు. సాటి గోవుల కాపర్ల ద్వారా విషయం తెలుసుకున్న అచ్చమాంబ బ్రహ్మంగారి మహత్యాన్ని గ్రహించి తనకు జ్ఞానోపదేశం చేయాల్సిందిగా ప్రార్థించింది. బ్రహ్మంగారు అచ్చమాంబకు ఆమె భర్తకు యాగంటి కొండ శిఖరము మీద కాలజ్ఞానము ఉపదేశించారు. ఇతర భక్తులు కూడా వారిని అనుసరించి ఆ ఉపదేశాన్ని వినేవారు. అందుకే యాగంటి సమీప పర్వత ప్రాంతానికి ముచ్చట్ల కొండ అని పేరు వచ్చింది. అచ్చమ్మ, బ్రహ్మంగారిని దర్శించుకున్న రవ్వలకొండలో ఈనాడు సుందరమైన బ్రహ్మంగారి దేవాలయం ఉంది.

బనగానపల్లెలో అచ్చమ్మ ఇంటి ఆవరణలోనే 14వేల కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై ఒక చింతచెట్టు నాటి ఆపై మరోసారి దేశాటనకు బయలుదేరారు. అలా కందిమల్లయ్యపల్లెకు చేరుకుని అక్కడ నివాసం ఏర్పర్చుకుని మామూలు వడ్రంగిలా జీవితం ప్రారంభించారు. అక్కడ కూడా వివిధ సందర్భాల్లో తన మహిమలు చూపడంతో కందిమల్లయపల్లె, పెద్దకొమెర్ల గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులకు ఆయనపై భక్తి ప్రవర్తులు ఏర్పడ్డాయి. బాల్యవివాహాలు ప్రబలంగా ఉన్న ఆ రోజుల్లో బ్రహ్మంగారు యుక్తవయస్సు ఉన్న గోవిందమ్మను వివాహం ఆడారు. వారికి ఆరుగురు సంతానం కలిగారు. కడపలోని కందిమలయ్యపల్లి గ్రామంలో రాజయోగిగా స్థిరపడిన బ్రహ్మంగారు కుల,మత.వర్గ విభేదాలను రూపు మాపేందుకు కృషి చేశారు. అందుకు ఆయన శిష్యులే నిదర్శనం. ప్రధాన శిష్యుడైన సిద్ధయ్య మహ్మదీయుడు. కక్కయ్య హరిజనుడు. అచ్చమాంబ రెడ్డి కుల స్త్రీ, అన్నాజయ్య బ్రాహ్మణుడు. అతి సామాన్యమైన ప్రజలకు తన తత్వాల ద్వారా కులాలు, మతాలకు అతీతమైన సర్వసమానత్వాన్ని సాధించే ఒక సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని బ్రహ్మంగారు ప్రయత్నించారు. నవాబుల పాలనలో మ్రగ్గిపోతున్న రాయలసీమ, తెలంగాణ హిందువులను రక్షించడానికే, విధర్మీయుల పాలనలో కునారిల్లిపోతున్న హిందూ ధర్మాన్ని పునరుజ్జీవింపజేయడానికే శ్రీపోతులూరి బ్రహ్మేంద్రస్వామి అవతరించారనిపిస్తుంది. గురుశిష్యులైన బ్రహ్మంగారు, సిద్ధయ్యల బోధనలు ప్రభావంతో అప్పటికే మతం మారిన ఎందరో తిరిగి తమ స్వధర్మాన్ని స్వీకరించారు. క్రొత్తవారు మతం మారకుండా కాపాడారు. తమ బోధనలతో హిందూ సమాజంలో ధార్మిక చైతన్యం కలిగించడమే కాక హిందూ సమాజంలోని మూఢాచారాలను, సామాజిక రుగ్మతలను నిర్మూలించగలిగారు. ఈ క్రమంలో బనగానపల్లె నవాబుకు తెలంగాన నవాబుకు తమ మహిమలు చూపించి వారికి సైతం జ్ఞానబోధ చేశారు.

శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాని మాత్రమే కాదు కాళికాంబ, హంసకాళికాంబ, వీర కాళికాంబ మకుటాలతో ఆయన రాసిన శతకాలు, తత్వగీతాలు ఆయనను మనకు ఒక గొప్ప కవిగా పరిచయం చేస్తాయి. హరి గోవింద , శివ గోవిందా అంటూ ఆయన పాడిన గోవింద పదాల్లోని మకుటం బ్రహ్మంగారి అర్థాంగిని ఉద్దేశించినది. ఇది స్త్రీలోకం పై ఆయన చూపిన గౌరవ మర్యాదలకు నిదర్శనమనే చెప్పాలి. ఆదిశంకరుల మాదిరి దేశాటన ద్వారా జ్ఞాన సంపద చేసి దానిని ప్రజల వద్దకు చేర్చిన బ్రహ్మంగారు కలియుగం 4694కు సమానమైన క్రీ.శ. 1693వ సంవత్సరం వైశాఖ మాస శుద్ధ దశమి తిథి శుక్రవారం రోజున జీవ సమాధి అయ్యారు. తన చర్యలతో సమతా, సమరసతా భావన నిర్మాణానికి విశేష కృషి చేసిన బ్రహ్మంగారు జీవ సమాధి అయిన అదే రోజు ప్రతి సంవత్సరం ఆరాధన ఉత్సవాలను నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం ఆగస్టు 19న జరుపుకుంటున్నాము. సర్వ మానవ కల్యాణాన్ని ఆశించిన ఆయన ప్రతి ఒక్కరికీ మార్గదర్శకులు. శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారికి మరోసారి ప్రమాణాలు అర్పిస్తూ ఆయనను గుర్తు చేసుకుందాం ఆయన చూపిన బాటలో ప్రయాణం చేదాం…