News

శ్రీశైలంలో ముగిసిన ద్విశతావధానం

54views

శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రావణమాసోత్సవాల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా, భీమడోలుకు చెందిన బులుసు అపర్ణచే ఈ నెల 14వ తేదీ ప్రారంభించిన ద్విశతావధానం కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఆలయ మాఢవీధిలోని నిత్యకళారాధన వేదికపై ‘‘అవధాన కవితా నీరాజనం’’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఐదు రోజుల పాటు నిర్వహించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించారు. కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రసిద్ధులైన 60 మంది కవిపండితులు పృచ్ఛకులుగా పాల్గొన్నారు. ముగింపు సమావేశానికి విశిష్ఠ అతిథిగా ఆచార్య జి.ఎస్‌. కృష్ణమూర్తి, వైస్‌ చాన్సలర్‌, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి వారు విచ్చేశారు. కార్యక్రమం ముగింపులో అవధాని, విశిష్ఠ అతిధులు, పృచ్‌చకులు, వ్యవహరించిన కవిపండితులందరికీ వేదాశీర్వచనంతో స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్‌. రమణమ్మ, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, పర్యవేక్షకురాలు గిరిజామణి తదితర సిబ్బంది పాల్గొన్నారు.