News

బంగ్లాలో హిందువుల భద్రతకు ఆయన హామీ ఇచ్చారు: ప్రధాని మోదీ

39views

బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనార్టీల భద్రతను కాపాడతామని తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ యూనస్ తనకు హామీ ఇచ్చినట్టు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. ఈ మేరకు యూనస్‌ తనతో ఫోన్‌లో మాట్లాడారని మోదీ తెలిపారు.

కాగా, ప్రధాని మోదీ ట్విట్టర్‌ వేదికగా.. ‘బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్‌ యూనస్‌ నుంచి నాకు ఫోన్‌కాల్ వచ్చింది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిణామాలపై ఇద్దరం చర్చించుకున్నాం. ఈ సందర్భంగా బంగ్లాలో ప్రజాస్వామ్యం, సుస్థిరత, శాంతియుత, ప్రగతిశీల ప్రభుత్వానికి భారత్ మద్దతు ఉంటుందని చెప్పాను. బంగ్లాలోని హిందువులు, మైనార్టీలకు భద్రత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

మరోవైపు, అంతకుముందు ప్రధాని మోదీ.. బంగ్లాదేశ్‌లో హిందువుల భద్రత విషయంలో 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనలో ఉన్నారు. త్వరలోనే అక్కడి పరిస్థితులు సాధారణస్థితికి వస్తాయని ఆశిస్తున్నాను. అక్కడ ఉన్న మైనార్టీలు, హిందువుల రక్షణను కూడా భారత్‌ కోరుకుంటోంది అని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల అంశంపై తలెత్తిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో షేక్‌ హసీనా దేశం విడిచివెళ్లారు. ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు పెరిగాయి. ఇండియన్ కల్చరల్ సెంటర్‌, ఇస్కాన్ ఆలయాన్ని కూడా నిరసనకారులు ధ్వంసం చేశారు. హిందువులపై దాడులు, వేధింపులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో, ఈ ఘటనపై యూనస్‌ స్పందించారు. హక్కులు అందరికీ సమానం. మతమేదైనా ప్రజాస్వామ్యంలో అందరం మనుషులమే. దయచేసి సంయమనం పాటించండి అని నిరసనకారులను కోరారు.