News

ఫోన్‌లో తలాక్‌…! విమానాశ్రయంలో అరెస్ట్

39views

రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి పని నిమిత్తం కువైట్‌కు వెళ్లి జీవిస్తున్నాడు. అయితే అతనికి పాకిస్థాన్‌కు చెందిన మహిళ పరిచయం అవ్వగా.. ఆమెను వివాహం చేసుకునేందుకు భారత్‌లోని తన భార్యకు ఫోన్‌ చేసి ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు. అయితే సోమవారం అతడు జైపూర్‌ భారత ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ కాగానే పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వివరాలు.. రాజస్థాన్‌లోని చురుకు చెందిన 35 ఏళ్ల రెహ్మాన్‌ కువైట్‌లో పనిచేస్తున్నాడు. అతడికి హనుమాన్‌గఢ్‌లోని భద్ర ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల ఫరీదా బానోతో 2011లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే, రెహ్మాన్‌కు పాకిస్థాన్‌కు చెందిన మెహ్విష్‌ అనే మహిళతో సోషల్‌ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమకు దారి తీసింది.

ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెహ్మాన్‌ కువైట్‌ నుంచి భారత్‌లో ఉంటున్న తన భార్యకు ఫోన్‌ ద్వారా త్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు. అనంతరం సౌదీ అరేబియాలో పాక్‌ మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె గత నెల టూరిస్ట్‌ వీసాపై చురుకు వచ్చి రెహ్మాన్‌ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.

ఈ క్రమంలో మొదటి భార్య ఫరీదా బానో తన భర్త రెహ్మాన్‌పై కేసు పెట్టింది. తనను అధిక కట్నం కోసం వేధించారని, ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా విడాకులు తీసుకున్నారని ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో కువైట్‌ నుంచి జైపూర్‌ విమానాశ్రయానికి చేరుకున్న రెహ్మాన్‌ను హనుమాన్‌ఘర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ప్రాథమిక విచారణ అనంతరం అతడిని అరెస్ట్‌ చేసినట్లు హనుమాన్‌గఢ్‌ డిప్యూటీ ఎస్పీ రణ్‌వీర్ సింగ్ తెలిపారు.