News

సత్యదేవునికి సువర్ణ ధ్వజ స్తంభం

42views

అన్నవరం రత్నగిరిపై మరో అపురూప ఘట్టం ఆవిష్కృమైంది. సత్యదేవుని ఆలయంలో శ్రావణ శుద్ధ పంచమి శుక్రవారం నూతన సువర్ణ ధ్వజ స్తంభాన్ని వేద మంత్రాల నడుమ ప్రారంభించారు. నెల్లూరుకు చెందిన దాత కుటుంబ సభ్యులు రూ.మూడు కోట్లు వ్యయంతో ఈ స్తంభం ఏర్పాటుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఉదయం తొమ్మిది గంటలకు ప్రత్యేక పూజల అనంతరం 10.20 గంటల సుముహూర్తంలో ధ్వజ స్తంభానికి పండితులు హారతి ఇచ్చారు. దాత దంపతులతో బాటు ఆలయ ఇన్‌చార్జి ఈఓ డీఎల్‌వి రమేష్‌ బాబు, డీఈఈ ఉదయ్‌ తదితరులు దానికి ప్రదక్షిణలు చేసి పూజలు ప్రారంభించారు. వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠీ, గంగాధరబట్ల గంగబాబు, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు సుధీర్‌, దత్తు శర్మ, పరిచారకుడు పవన్‌, వ్రత పురోహితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

50 ఏళ్ల తరువాత నూతన ‘స్వర్ణ’ ధ్వజస్తంభం
సుమారు 135 ఏళ్ల ఆలయ చరిత్ర కలిగిన సత్యదేవుని ఆలయంలో 50 ఏళ్ల తరువాత పాత ధ్వజస్తంభం స్థానంలో నూతన ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసి స్వర్ణ తాపడం చేశారు. గత ఏడాది మే నెలలో పాత ధ్వజస్తంభ పాడైందని గుర్తించి నూతన స్తంభానికి అప్పటి ఈఓ చంద్రశేఖర్‌ అజాద్‌ భావించగా, అదే సమయంలో స్వర్ణ తాపడానికి దాతలు ముందుకు వచ్చారు. ఈ మేరకు గత ఏడాది ఆగస్టులో గుంటూరు జిల్లా తెనాలిలోని టింబర్‌ డిపో నుంచి కర్రను సేకరించి అక్టోబర్‌లో దేవస్థానానికి తీసుకువచ్చారు. అనంతరం గత ఏప్రిల్‌ 22న అనివేటి మండపంలో దేవదాయ, ధర్మదాయశాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ, దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ కె.రామచంద్రమోహన్‌, ధ్వజస్తంభం దాత, పెద్ద సంఖ్యలో భక్తుల సమక్షంలో నూతన ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే నెలలో మండపేటకు చెందిన చిన్నా బృందం సభ్యులు సుమారు 300 కిలోల రాగి రేకులను ధ్వజస్తంభానికి అమర్చి సరిచూసి అనంతరం చెన్నయ్‌కు చెందిన స్మార్ట్‌ క్రియేషన్స్‌ సంస్థకు బంగారు పూత కోసం దాతలు అప్పగించారు.

● ఇదంతా పూర్తయ్యాక ఈ నెల తొమ్మిదో తేదీన నూతన ధ్వజ స్తంభానికి స్వర్ణ రేకు తాపడం చేయాలని దేవస్థానం అధికారులు నిర్ణయించి చదరపు అడుగు రేకుకు ఐదు గ్రాముల బంగారం చొప్పున రెండు కిలోల 24 క్యారట్‌ బంగారంతో పూత పూసినట్లు తెలిపారు. కాగా దేవస్థానం అధికారులు అనుమతిస్తే ధ్వజస్తంభం పీఠానికి కూడా స్వర్ణ రేకు తాపడం చేస్తామని దాత తెలిపారు.