News

హిందూ సంగీత‌కారుడి ఇంటిని తగలబెట్టిన ఆందోళ‌న‌కారులు!

73views

బంగ్లాదేశ్‌లో రిజ‌ర్వేష‌న్ కోటాకు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌కారులు విధ్వంసం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. ఆందోళ‌న‌కారులు చేప‌ట్టిన‌ నిర‌స‌న ర్యాలీలు హింసాత్మ‌కంగా మార‌డంతో భారీ మొత్తంలో ఆస్తి, ప్రాణ‌న‌ష్టం జ‌రుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 400 మంది వ‌ర‌కు ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు.ఆ దేశ‌ ప్ర‌ధాని షేక్ హ‌సీనా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. అనంత‌రం ఆమె దేశం విడిచిపెట్టి భార‌త్‌లో త‌ల దాచుకున్నారు. ఆమె దేశం విడిచి వెళ్లిన త‌ర్వాతి రోజు నుంచి బంగ్లాదేశ్‌లో హిందువులు సహా మైనారిటీలపై దాడులు తీవ్రమయ్యాయి. వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల ఇళ్ల‌ను దోచుకోవ‌డం, నిప్పు పెట్ట‌డం చేస్తున్నారు. తాజాగా ఢాకాలో హిందూ సంగీత‌కారుడు, గీత రచయిత, గాయకుడు అయిన రాహుల్ ఆనంద ఇంటికి ఆందోళ‌న‌కారులు నిప్పు పెట్టారు. ఢాకాలోని ధన్మొండి 32లో ఉన్న ఆయ‌న‌ నివాసంపై ఒక్క‌సారిగా ఓ గుంపు దాడి చేసి విధ్వంసం సృష్టించింది. ఈ దాడి నుంచి ఆనంద‌, అత‌ని భార్య‌, కుమారుడు ఎలాంటి ప్ర‌మాదం లేకుండా త‌ప్పించుకున్నారు. ఇంటికి నిప్పు పెట్ట‌డానికి ముందు నిర‌స‌న‌కారులు మూడు వేల‌కుపైగా సంగీత వాయిద్యాల‌ను త‌గ‌ల‌బెట్టేశారు. అంత‌టితో ఆగ‌కుండా ఇంట్లోంచి విలువైన వ‌స్తువుల‌ను ఎత్తుకెళ్లారు.