News

నదీ తీరాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలతో పర్యావరణంపై ప్రభావం: సుప్రీం

37views

నదితీరంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పారబోయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది పర్యావరణంతోపాటు జలచరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని జస్టిస్‌ రిషికేశ్‌ రాయ్, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, శాశ్వత ఆక్రమణలపై వేసిన పిటిషన్‌ను 2020 జూన్‌ 30న ఎన్‌జీటీ కొట్టివేయడంపై పట్నాకు చెందిన అశోక్‌ కుమార్‌ సిన్హా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను విన్న సర్వోన్నత న్యాయస్థానం పై వ్యాఖ్యలు చేసింది. ‘‘నదీతీరాల్లో ప్లాస్టిక్‌ను పారవేయడం పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తోంది. జలచరాలపై కూడా ఎంతో ప్రభావాన్ని చూపుతోంది. ప్రజల సహకారంతో బాధ్యతగల అధికారులు సమష్టి కృషి చేయకపోతే.. చట్టవిరుద్ధమైన నిర్మాణాలను తొలగించడం, గంగ, దేశంలోని ఇతర నదుల్లో నీటి నాణ్యతను పెంచడం వంటి లక్ష్యాలు భ్రమలుగానే మిగిలిపోతాయి’’ అని ధర్మాసనం పేర్కొంది. దీనిపై నాలుగు వారాల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటీని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.