News

సమున్న‘తరంగ్‌’ ఆర్మీ, నౌకా, వైమానిక దళాల ఆధ్వర్యంలో ప్రారంభం

68views

రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత్‌ వరుస అంతర్జాతీయ విన్యాసాలకు వేదికగా నిలుస్తూ.. ప్రపంచ దేశా­లకు ఆతిథ్యమిస్తోంది. మిలాన్, ఐఎఫ్‌ఆర్‌ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల్ని నిర్వహించిన భారత్‌.. మరో కీలక విన్యాసాలకు సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీ నుంచి రెండు దశల్లో జరిగే తరంగ్‌శక్తి యుద్ధ విన్యాసాలు తమిళనాడులోని సూలూరులో జరగ­ను­న్నాయి. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆధ్వర్యంలో భారత నౌకాదళ సహకారంతో ప్రారంభం కానున్న విన్యాసాల్లో 30 దేశాలకు పైగా పాల్గొంటున్నాయి.

భారత్‌ సత్తా చాటేలా..
భారత రక్షణ వ్యవస్థ సత్తా ప్రపంచానికి చాటేలా త్రివిధ దళాల సమన్వయం ఎలా ఉంటుందో శత్రు దేశాలకు తెలియజేసేలా.. భాగస్వామ్య దేశాల మధ్య పరస్పర సహకారం మ­రిం­త పెంపొందేలా ‘తరంగ్‌ శక్తి’ యుద్ధ విన్యాసాలు మంగళవారం నుంచి ప్రా­రం­భం కానున్నాయి. భారత వాయుసేన, ఆర్మీ, ఇండియన్‌ నేవీ కలిసి నిర్వహిస్తున్న అంతర్జాతీయ విన్యాసాలకు 51 దేశాలకు ఆహ్వానమందించగా.. 30కి పైగా దేశాలు హాజరవుతు­న్నాయి.

మొదటి దశ ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకూ తమిళ­నాడులో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ 12 వరకూ రాజస్థాన్‌లోని జో«ధ్‌పూర్‌లో రెండో దశ విన్యాసాలు జరగనున్నాయి. భారత త్రివిధ దళాల అధిపతులతో పాటు జర్మనీ, ఆస్ట్రే­లియా, బంగ్లాదేశ్, కెన్యా, జపాన్, నేపాల్, గిని­యా దేశాలకు చెందిన చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌స్టాఫ్, చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ ముఖ్య అతిథులుగా హాజరవు­తున్నారు. ఈ విన్యా­సాలకు రష్యా, ఇజ్రాయిల్‌ దూరంగా ఉంటున్నాయి.

తొలి దశలో భారత నౌకాదళం
తమిళనాడులో జరిగే ఫేజ్‌–1 విన్యాసాల్లో భారత నౌకాదళం ప్రాతినిధ్యం వహిస్తోంది. తూర్పు నౌకా­దళం ఆధ్వర్యంలో జరిగే విన్యాసాల్లో యుద్ధ నౌక­లపై హెలికాప్టర్ల ల్యాండింగ్, ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారి­యర్లపై మిగ్‌–29, రాఫెల్‌ యుద్ధ విమానాల ల్యాండింగ్, ఫైరింగ్‌ తదితర విన్యాసాలు నిర్వహించను­న్నారు. రక్షణ రంగంలో స్వావలంబన, అంతర్జాతీ­యంగా భారత్‌ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు తరంగ్‌ శక్తి కీలకంగా మారనుంది.

సత్తా చాటనున్న ఐఏఎఫ్‌
ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఈ విన్యాసాల్లో సత్తా చాటనుంది. ఎల్‌సీఏ తేజస్‌ యుద్ధ విమానాలు, రాఫెల్, మిరాజ్‌ 2000, ఎల్‌సీ­హెచ్‌ ప్రచండ్, ధృవ్, రుద్ర, జాగ్వర్, మిగ్‌–­29, సీ–130, ఐఎల్‌–78 తదితర యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు విన్యాసా­ల్లో పా­ల్గొం­టు­న్నాయి.

భారత వైమానిక దళంతో పాటుగా ఆస్ట్రేలియాకు చెందిన ఎఫ్‌–18, బంగ్లాదేశ్‌కు చెందిన సీ–130, ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్, జర్మనీకి చెందిన టైఫూన్, గ్రీస్‌కు చెందిన ఎఫ్‌–16, స్పెయిన్‌కు చెందిన టై­పూన్, యూఏఈకి చెందిన ఎఫ్‌–16, యూ­కేకి చెందిన టైపూన్, యూఎస్‌ఏకి చెందిన ఏ–10, ఎఫ్‌–16, ఎఫ్‌ఆర్‌ఏ, సింగపూర్‌­కు చెందిన సీ–130 యుద్ధ విమానాలు, బల­గాలు విన్యాసాల్లో భాగస్వామ్యం అవుతున్నాయి.