News

కూచిపూడిలో గిరిజన బిడ్డల ప్రతిభ- దేశ విదేశాల్లో అద్భుత ప్రదర్శనలు

68views

తెలుగువారి ప్రాచీన నృత్యం కూచిపూడి. పూర్వకాలం నుంచి అందరిని మెప్పించిన ఈ నాట్యం తరువాతి కాలంలో ఆదరణ కోల్పోతూ వస్తోంది. ప్రాచీనకాలంలో ఓ వెలుగు వెలిగిన ఈ నృత్యంపై మళ్లీ ఇప్పటి యువతరం ఆసక్తి పెంచుకుంటోంది. ఎందరో యువతీయువకులు ప్రత్యేకశ్రద్ధతో నేర్చుకుని దేశవిదేశాల్లో ప్రదర్శనలిస్తున్నారు. అలాంటి కళాకారుల్లో ముందువరుసలో ఉంటున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరిజన బిడ్డలు.

శ్రీకాకుళం నగరానికి 5 కిలోమీటర్ల దూరాన ఉన్న కల్లేపల్లి గ్రామంలో 12 ఎకరాల విస్తీర్ణంలో సాంప్రదాయం ప్రభుత్వ కూచిపూడి గురుకులం ఉంది. 2019 నుంచి ఇక్కడ క్రమం తప్పకుండా తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో మొట్టమొదటి కూచిపూడి గురుకులం ఇదే కావడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం ఈ కూచిపూడి గురుకులంలో 100 మందికి పైగా విద్యార్థులు ఈ కళను నేర్చుకుంటున్నారు. ప్రభుత్వం ఉచితంగా కూచిపూడి నాట్యాన్ని నేర్పడంతో అనేకమంది పేద గిరిజన విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి డిప్లోమా, డిగ్రీ కోర్సులను అభ్యసిస్తున్నారు.

కూచిపూడి గురుకులం విద్యార్థులు దేశ విదేశాల్లో పలు ప్రదర్శనలు ఇస్తూ ప్రసంశలు పొందుతున్నారు. కూచిపూడి ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాపింప చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వీరి తీరు అభినందనీయం. ప్రతి ఒక్కరిలోను కళ ఉంటుందని వాటిని గుర్తించి ప్రోత్సహిస్తే వారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని తల్లిదండ్రులకు ఇక్కడి విద్యార్థులు పిలుపునిస్తున్నారు.