News

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం: సమాజ్‌వాదీ నేత అరెస్ట్

57views

ఉత్తరప్రదేశ్ అయోధ్య జిల్లా బదార్షా ప్రాంతంలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మొయిద్ ఖాన్, అతని పనివాడు రాజు కలిసి 12ఏళ్ళ బాలికపై రెండు నెలల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అత్యాచారాన్ని వీడియో తీసి వైరల్ చేయడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు.

బాధిత బాలిక కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, మొయిద్ ఖాన్‌కు ఒక దుకాణం ఉంది. అక్కడికి బాలిక అప్పుడప్పుడూ వెడుతుండేది. ఘటన జరిగినరోజు ఆ బాలికను చిరుతిండి ఆశ పెట్టి పిలిచారు. తెలిసిన దుకాణమే కదా అని బాలిక వెళ్ళింది. అక్కడ మొయిద్ ఖాన్, అతని పనివాడు రాజు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా, తమ అత్యాచారాన్ని వీడియో తీసారు.

ఆ వీడియోను అందరికీ చూపిస్తామని బెదిరించి ఆ బాలికపై రెండు నెలల పాటు వారిద్దరూ అత్యాచారం చేసారు. ఫలితంగా ఆ బాలిక గర్భవతి అయింది. బాలిక తనకు కడుపునొప్పి వస్తోందని తల్లికి చెప్పడంతో విషయం వెలుగు చూసింది. దాంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితులు మొయిద్ ఖాన్, రాజులను అరెస్ట్ చేసారు.

బదార్షాలో పోలీస్ పోస్ట్ ఉన్న స్థలం మొయిద్ ఖాన్‌దే కావడంతో నిందితులు కేసును తలకిందులు చేస్తారని బాధిత కుటుంబం సందేహపడింది. దాంతో పోలీసులు కేసును మరో స్టేషన్‌కు బదిలీ చేసారు.

మొయిద్ ఖాన్, అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్‌కు సన్నిహితుడు అన్న విషయంపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు ఎస్పీ నేత కావడంతో కేసును ఉపసంహరించుకోవాలంటూ అధికారులు తమపై ఒత్తిడి చేస్తున్నారని బాధిత బాలిక కుటుంబం ఆరోపించింది.

ఈ దారుణంపై బిజెపి, నిషాద్ పార్టీ, బజరంగ్‌దళ్, ఇతర స్థానిక హిందూసంస్థలు నిరసనలు చేపట్టాయి. ఆయా సంస్థల కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు. విచారణ సవ్యంగా జరగడానికి అన్నిచర్యలూ తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.