News

‘మతసంస్థల ఒత్తిళ్ళతో అక్రమ ఆక్రమణలను తొలగించకపోవడమే వయనాడ్ విలయానికి కారణం’

53views

కేరళ వయనాడ్‌లో ప్రకృతి ప్రకోపం వందలమంది ప్రజల ప్రాణాలు హరించింది. అయితే ఆ విపత్తు ప్రకృతి సహజమైనది కాదనీ, మానవ నిర్లక్ష్యమేనని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంటు సాక్షిగా కుండబద్దలుకొట్టారు. వయనాడ్ ఎంపీ అయి ఉండీ, రాహుల్ గాంధీ ఆ ప్రాంతంలో కీలక విషయాలను పట్టించుకోలేదని మండిపడ్డారు.

‘‘2020లో కేరళ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని సూచనలు చేసింది. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడే ప్రమాదమున్న ప్రదేశాల నుంచి 4వేల ఇళ్ళను తరలించాలని సలహా ఇచ్చింది. ఈరోజు వరకూ ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. వయనాడ్ ఎంపీ ఆ విషయాన్ని కనీసం ఇవాళ్టి వరకూ పార్లమెంటులో ప్రస్తావించనే లేదు. అక్కడి అక్రమ ఆక్రమణలను మతసంస్థల ఒత్తిళ్ళ వల్లనే తొలగొంచలేకపోయామని కేరళ అటవీశాఖ మంత్రి ఆ రాష్ట్ర శాసనసభలో ఒప్పుకున్నారు’’ అని బెంగళూరు దక్షిణ నియోజకవర్గ ఎంపీ తేజస్వి సూర్య బుధవారం నాడు పార్లమెంటులో వెల్లడించారు.

‘‘రాహుల్ గాంధీ గత 1800 రోజులుగా వయనాడ్ ఎంపీగా ఉన్నారు. ఆయన కొండచరియల విషయం కానీ, వరదల విషయం కానీ ఒక్కటంటే ఒక్కసారైనా పార్లమెంటులో ప్రస్తావించనేలేదు’’ అని తేజస్విసూర్య గుర్తుచేసారు.

‘‘వయనాడ్‌లో జరిగింది ప్రకృతి విపత్తు కాదు, అది మానవుల కారణంగా తలెత్తిన విపత్తు. ఆ విషయం నేను చెప్పడం లేదు. కేరళకు చెందిన పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. గత ఐదారేళ్ళుగా దేశంలో జరిగిన కొండచరియలు విరిగిపడిన సంఘటనల్లో 60శాతం కేరళలోనే జరిగాయి’’ అని తేజస్విసూర్య మీడియాకు వివరించారు.

‘‘2020లో కేరళ విపత్తు నిర్వహణ సంస్థ కేరళ ప్రభుత్వానికి సూచనలిచ్చింది, వయనాడ్‌లోని పశ్చిమ కనుమల్లో తూర్పు భాగాన్ని అక్రమంగా ఆక్రమించుకుని నిర్మాణాలు చేసారు. అక్కడున్న 4వేల ఇళ్ళనూ తొలగించాలని, ఆ కుటుంబాలను తరలించాలనీ ఆ సంస్థ చెప్పింది. కేరళలో పశ్చిమ కనుమల ప్రాంతం అంతా వాణిజ్య కార్యకలాపాలు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయి దానివల్ల పశ్చిమ కనుమల మూలాలే కదిలిపోతున్నాయి’’ అని తేజస్విసూర్య చెప్పుకొచ్చారు.

‘‘అయితే ఆ ప్రాంతం నుంచి ఇప్పటివరకూ ప్రజలను తరలించనే లేదు. దానికి కారణం ఓటుబ్యాంకు రాజకీయాలే. ఎల్‌డిఎఫ్ ప్రభుత్వపు అటవీశాఖ మంత్రి 2021లో కేరళ అసెంబ్లీలో ఆ విషయాన్ని వివరించారు. అక్కడి అక్రమ ఆక్రమణలను తొలగించకుండా మతసంస్థలు, రాజకీయ నాయకులూ తీవ్రమైన ఒత్తిడి చేసారు, అందువల్లే ఆ అక్రమ ఆక్రమణలను తొలగించలేకసోయాం అని ఆయన చెప్పుకొచ్చారు. ఆ ప్రాంతంనుంచే రాహుల్‌గాంధీ ఐదేళ్ళుగా ఎంపీగా ఉన్నారు. కానీ ఆ అక్రమ ఆక్రమణలను తొలగించాలంటూ ఆయన పార్లమెంటులో కానీ, బైట కానీ ఒక్కసారయినా గొంతెత్తలేదు’’ అని తేజస్విసూర్య చెప్పారు.

వయనాడ్ ప్రాంతంలో 41శాతం ముస్లిం జనాభా ఉంది. వారి ఒత్తిళ్ళకు ఎల్‌డిఎఫ్ లేదా యుడిఎఫ్ ఏ ప్రభుత్వమైనా తలొగ్గుతారు. వారి అక్రమాలను చూసీచూడనట్లు వదిలేస్తారు. అదే ఇప్పుడు ఇంతపెద్ద విపత్తుకు కారణమైంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఆ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. పైగా, ఈ సంక్షోభ సమయంలో మానవత్వంతో ప్రవర్తించకుండా అంశాన్ని రాజకీయం చేస్తున్నారంటూ కేంద్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుండడం విడ్డూరం.