ArticlesNews

అన్నీ తామై వయనాడ్ లో సేవ చేస్తున్న ”సేవా భారతి” కార్యకర్తలు, స్వయంసేవకులు

74views

కేరళ లోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 150 కి పైగా మృతదేహాలను కనుగొన్నారు. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నవారి సంఖ్య తెలియరాలేదు. వీరిని కనుగొనేందుకు జాగిలాల సాయం కూడా తీసుకుంటున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున వర్షం కురుస్తుండటంతో.. సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇటు సహాయక చర్యల్లో రాష్ట్ర, కేంద్ర బలగాలకు తోడు.. సేవా భారతి వాలంటీర్లు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. బాధితులకు కావాల్సిన అవసరాలు తీరుస్తున్నారు. ముఖ్యంగా బాధితులకు ఆహారం, నీరు అందించడంతో పాటు.. గాయపడ్డవారికి సకాలంలో వైద్యం అందేలా ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అంతటితో ఆగకుండా.. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయినవారికి అంత్యక్రియలు సైతం నిర్వహిస్తున్నారు.

వయనాడ్ లోని చురల్ మలలో ఈ దుర్ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సేవాభారతి వాలంటీర్లు.. రెస్క్యూ ఆపరేషన్ లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకుని.. సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. పగలు, రాత్రి తేడా లేకుండా బాధితులకు సహాయం చేయడం కోసం శ్రమిస్తున్నారు. వర్షం పడుతున్నా.. బాధితులకు కావాల్సిన సాయాన్ని అందించడంలో ముందుంటున్నారు.

అలాగే బాధితులు వేగంగా ఆస్పత్రుల్లో చేరేలాగా కూడా ఈ సేవాభారతి వారు చూస్తున్నారు. చేరడమే కాకుండా వారికి వైద్యం అందేలాగా కూడా సమన్వయం చేస్తున్నారు. మరోవైపు రోడ్లపైన పేరుకుపోయిన చెత్తా చెదారం, పెద్ద పెద్ద రాళ్లను కూడా తొలగిస్తున్నారు. ఇక… అంబులెన్సులు వేగంగా ఆస్పత్రులకు వెళ్లేలాగా కూడా స్వయంసేవకులు, సేవా భారతి కార్యకర్తలు శతధా ప్రయత్నాలు చేస్తున్నారు. క్షతగాత్రులకు ఆహారం, మాత్రలు అందేలా చూస్తున్నారు. వీటన్నింటితో పాటు మృతదేహాల కోసం సేవా భారతి మొబైల్‌ వాహనాలను కూడా అందుబాటులో వుంచారు. కేరళలోని వాయనాడ్‌లో వున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల దహన సంస్కారాలకు కూడా ఇబ్బందులున్నట్లు తెలిసి… దహన సంస్కారాలు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
స్థానికంగా వున్న కష్ట నష్టాలను కూడా సేవా భారతి కార్యకర్తలు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. స్థానికంగా వుండే చిన్న చిన్న స్థలాలు, చిన్న చిన్న స్థలాల కారణంగా నడవడానికి కూడా ఇబ్బందిగానే వుంది. దహన సంస్కారాలు నిర్వహించేందుకు కూడా కష్టంగా వుంది. దీంతో దహన సంస్కారాలు నిర్వహించేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేసి, దహన సంస్కారాల్లో కూడా భాగం పంచుకుంటున్నారు. ఇక విశేషమేమిటంటే కులం, మతం అంటూ ఏదీ చూడకుండా స్వయంసేవకులు, సేవాభారతి వారు సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సేవా భారతికి సంబంధించిన మొబైల్‌ దహన వ్యవస్థను క్రిస్టియన్లు కూడా స్వీకరించాయి.

ప్రకృతి విపత్తులు ఎప్పుడు వచ్చినా.. సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటుంది.. సేవా భారతి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ సంస్థ అయిన సేవా భారతి.. ప్రధానంగా విద్య, విలువలు, సామాజిక అవగాహన కల్పించడంలో కృషి చేస్తుంది. విపత్తులలో బాధితులకు అండగా నిలుస్తుంది. వరదలు, భూకంపాలు వంటి కల్లోలిత సమయాల్లో ప్రజలను ఆదుకోవడానికి సేవా భారతి ఎప్పుడూ ముందే ఉంటుంది.