News

శ్రీముఖలింగంలో నానాటికీ తీసికట్టుగా పరిస్థితి

65views

కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖ దర్శ నం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని ప్రతీతి. శ్రీకాకుళం జిల్లా జూలుమూరులో ఉన్న ముఖలింగంలో స్వామిని దర్శించుకున్న వారికి మోక్షమేమో గానీ క్షేత్రానికి మాత్రం మోక్షం రావ డం లేదు. దశాబ్దాలుగా నిర్వహణ లోపంతో క్షేత్రం కునారిల్లిపోతోంది. ఈ పురాతన ఆలయం పురా వస్తు శాఖ పర్యవేక్షణలో ఉంది. చాలా విశిష్టమైన నిర్మాణం కావడంతో.. ఇక్కడ చేయాల్సిన ప్రతి పనినీ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో మాత్రమే చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. కానీ ఆ శ్రద్ధ కనిపించకపోవడంతో భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. చోళుల కాలం 8 వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల నుంచి భక్తులు, పర్యాటకులు నిత్యం ఇక్కడకు వస్తుంటారు. కార్తీక మాసం, శివరాత్రి ఉత్సవాలకు దేశం నలుమూలలు నుంచి సుమారు మూడు లక్షలు వరకూ భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ఆలయాన్ని శ్రద్ధగా పరిశీలించి లోపాలు సరిచేస్తే క్షేత్రం మరింత విశిష్టంగా పరిఢవిల్లుతుందని భక్తులు కోరుతున్నారు.

చేయాల్సిన పనులు..

● వానలు పడినప్పుడల్లా గర్భగుడి లోపల నీరు చేరుతోంది.

● మధుకేశ్వరుని పానమట్టం గోతులుగా మారి పూజాది ద్రవ్యాలు, పంచామృతాలు నిల్వ ఉండి పోతున్నాయి.

● ప్రధాన ఆలయం గర్భగుడిలో ఫ్లోరింగ్‌ బీటలు వారి పూజా సామగ్రి నిల్వ ఉండిపోయి దుర్వాసన వెదజల్లుతోంది.

● ప్రధాన ఆలయంలో నిత్యాభిషేకాలు, ఏకవార అభిషేకాలు అనంతరం బయటకు చండీశ్వరుడి మీదుగా వారాహి అమ్మవారి పక్క నుంచి వెళ్లే తీర్థం వంశధారకు అనుసంధానం చేశారు. కానీ నిర్వహణ సరిగా లేక ఆలయ దేవతా విగ్రహాలకు పూజలు చేసే సమయంలో భరించరాని దుర్గంధంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

● ఇదే చోట ఏర్పాటు చేసిన ట్యాంక్‌ కూడా వ్యర్థాలతో నిండిపోవడంతో భక్తులు నానా అవస్థలు పడుతున్నారు.

● ఆలయం లోపల రాతి పలకల మధ్య ఖాళీలు ఏర్పడడంతో వాటి మధ్య నీరు, ఇతర వ్యర్థాల వల్ల పూజలు చేసేందుకు కూడా భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

● గర్భగుడి లోపల గోలెం నుంచి ఇటు నిత్య దీపారాధన వరకూ భక్తులు ఉండేందుకు కూడా అవకాశం లేదు.

● శివరాత్రి, కార్తీక మాసాల్లో అభిషేకాలకు ఇబ్బంది తప్పడం లేదు.

● అష్ట దిక్పాలకులైన ఇంద్రేశ్వరుడు, వాయువేశ్వరుడు, అగ్నీశ్వరుడు, వరుణేశ్వరుడు, నైరుతేశ్వరుడు, యమేశ్వరుడు, కుబేరశ్వరుడు, ఈశాన్యే శ్వరుడు ప్రతిష్టించిన శివలింగాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి.

● కుబేరుడు మినహా అన్ని శివలింగాల పానమట్టాలు శిథిలమైపోవడంతో పాలు, కొబ్బరినీరు, పంచామృతాలతోపాటు ఇతర పూజా వస్తువు నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతోంది.

మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం
ముఖలింగంలో ప్రధాన ఆలయం, గర్భగుడిలో పలు సమస్యలు గుర్తించాం. లోపల భాగం అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఇటీవలే కేంద్రపురావస్తు శాఖ ఇంజినీరుతో పరిశీలించి నివేదిక సిద్ధం చేశాం. ఇప్పుడు వానాకాలం కాబట్టి.. త్వరలోనే పనులు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – నవీన్‌, కన్జర్వేటివ్‌ అసిస్టెంట్‌,
కేంద్రపురావస్తు శాఖ, విశాఖపట్నం