ArticlesNews

దృశ్యం – దర్శనం

75views

వేదభూమి పుణ్యభూమి కర్మభూమి… వంటి ఉదాత్త విశేషణాలతో మనదేశాన్ని ప్రపంచం ప్రశంసిస్తుంది. వాటిలో అతిశయోక్తులు ఏమీ లేవు. ఈ ప్రశస్తికి మూలమైన అంశాలను పరిశీలిస్తే- భారతీయ ఆత్మకు చెందిన మౌలిక లక్షణాలు మనకు తెలుస్తాయి. అప్పుడే ఈ దేశం ప్రత్యేకత అర్ధం అవుతుంది.

భారతదేశం యథార్ధానికి గొప్ప తత్త్వశాస్త్ర గ్రంథం, ఉత్తర, దక్షిణ భారతాలు దీనిలోని రెండు ప్రధాన ఆధ్యాయాలు, ఉత్తర భారతదేశం- ఒకానొక అద్భుత ‘దృశ్యం దాని సర్వ సమగ్ర దర్శన మహాభాగ్యం- దక్షిణ భారతావనిది. ఈ దేశంలోని అవతార మూర్తులకు గాని, దేవీ దేవతా భావనలకు గాని పురుటి పేగు- ఉత్తరభారతం దివ్యమైన అయా దర్శనాలకు నోచుకున్న కారణజన్ములైన మన ఆచార్యులు, దార్శనికులు ప్రధానంగా దక్షిణాదివారు. భారతదేశ దివ్య ‘దృశ్య దర్శన యోగం’లో శంకర భగవత్పాదులు, మధ్వాచార్యులు, రామానుజులు, వల్లభాచార్యులు, నింబార్కుడు, సాయనాచార్యుడు, దిజ్ఞాగుడు… వంటి కారణజన్ములది కీలకపాత్ర, వారు దక్షిణ భారతంలో పుట్టి- ఉత్తరదేశ దేవీ దేవతల, అవతార పురుషుల ఆవిర్భావ విశేషాలను ఆకశించుకున్నారు. తరించారు. వారి పుట్టు పూర్వోత్తరాలకు వీరు వైతాళిక గీతాలు సమకూర్చారు. ఆయా దేవతామూర్తుల ఆవిర్భావ విశేషాలకు, మహిమాన్విత జీవిత ఘట్టాలకు- వీరు వ్యాఖ్యాతలుగా, ప్రవక్తలుగా వ్యవహరించారు. తమ స్వీయ అలౌకిక అనుభూతులకు అక్షర రూపాన్నిచ్చి రచనల ద్వారా, ప్రవచనాల రూపంలో లోకాన్ని తరింప చేశారు. ఇది దృశ్య దర్శన యోగానికి చెందిన అమోఘ తాత్విక సరాగ మాలిక. భారతదేశ సర్వ సమైక్య భావనకు జయపతాక.

సూటిగా చెప్పాలంటే- దక్షిణాది. ఆచార్యులు, ప్రవక్తలు లేకుంటే- ఉత్తరభారతంలోని దేవతలకు ప్రాచుర్యం ప్రసిద్ధి లేవు. అలాగే ఉత్తరాది దేవతలను విస్మరిస్తే దక్షిణాది దార్శనికులకు గమ్యం లక్ష్యం కనపడవు. ఇవి రెండూ ఒకదానితో మరొకటి పెనవేసుకున్న వ్యవస్థలు. భారతదేశ గళసీమలోని తాళిబొట్టుకు చెందిన రెండు మంగళసూత్రాలవి. ఈ మౌలిక సూత్ర బంధానికి పురోహితులు- మన ప్రాచీన మహర్షులు. భారతదేశ నిసర్గ తాత్విక పవిత్ర భూమికను సమగ్రంగా ఆకళించుకోవాలంటే ఆ మౌలిక సూత్రాన్ని జీర్ణించుకోవాలి. మొదట్లో చెప్పుకొన్న మూడు విశేషణాలకు మూలం ఏమిటో, ఆధార పీఠం ఏదో అప్పుడే అర్ధం అవుతుంది.

గంభీరమైన ఈ తత్వ దర్శనాన్ని సామాన్య ప్రజలకు బోధపడేలా చేసేందుకై మన పెద్దలు- కాశీ రామేశ్వరాలు, గంగా గోదావరులంటూ కొన్ని అపురూప ఆధ్యాత్మిక భావనలను ప్రజల హృదయాల్లోకి చొప్పించారు. ఎక్కడి కాశీ, ఎక్కడి రామేశ్వరం: గంగ ఎక్కడ పారుతోంది, గోదావరి ఎక్కడ ప్రవహిస్తోంది? క్షేత్రాల పేరుతో రెంటిని, తీర్థాల పేరుతో ఈ రెంటిని కలిపి ముడిపెట్టి ఆధ్యాత్మిక సమైక్య భావనకు అంటు కట్టడంలో మన పెద్దలు ఎంత దూరం ఆలోచించి ఉంటారు. ఆలోచనలోని ఔన్నత్యం గాని, ఔచిత్యం గాని అర్థమైతే ఒళ్లు పులకరించిపోదూ? దేశ సమైక్యతకు ఆలోచనలే కదా మూలాలు: కోసల దేశానికి చెందిన శ్రీరాముణ్ని- గంగాతీర నివాసి కబీర్ దాస్ మాత్రమే కాదు, కావేరీ తీరాన త్యాగరాజ స్వామి సైతం ‘రాముడు నా వాడు’ అని కీర్తించడంలో ఉంది ఈ జాతి జీవనాడి! ఈ దేశ పౌరులుగా- భారతదేశమనే తత్వశాస్త్ర గ్రంథాన్ని అధ్యయనం చేయడం, దృశ్య దర్శన యోగంలోని ఆధ్యాత్మిక జీవధారను అనుభూతి చెందడం మన తక్షణ కర్తవ్యం