News

అమర్‌నాథ్ యాత్ర సరికొత్త రికార్డు… 29 రోజుల్లో 4.51 లక్షల మంది దర్శనం

72views

దక్షిణ కశ్మీర్‌లోని పర్వతాల్లో భూమికి 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకునే యాత్రికుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది గత సంవత్సరం రికార్డును బద్దలుకొడుతూ సరికొత్త రికార్డును సృష్టించింది. కేవలం 29 రోజుల్లో 4.51 లక్షల మంది ఈ యాత్రలో పాల్గొని అమర్‌నాథ్ గుహల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. జూన్ 29న ఈ యాత్ర ప్రారంభం కాగా, కేవలం 29 రోజుల్లోనే ఈ రికార్డు సాధించినట్టు అమర్‌నాథ్ ఆలయ బోర్డు (ఎస్ఏఎస్‌బీ) ప్రకటించింది. గత ఏడాది పూర్తి యాత్రాకాలంలో 4.45 లక్షల మంది అమరనాథుని దర్శించుకున్నట్టు తెలిపింది.

కాగా, శనివారంనాడు సుమారు 8,000 యాత్రికులు అమరనాథుని దర్శించుకున్నారని, మరో 1,677 మందితో కూడిన బృందం జమ్మూలోని భాగ్‌వతి నగర్ యాత్రి నివాస్‌ నుంచి జమ్మూలోని పవిత్ర అమరనాథ గుహకు బయలుదేరిందని అధికారులు చెప్పారు. జూన్ 29న యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి అతి తక్కువ సంఖ్యలో యాత్రికుల బృందం బయలుదేరడం ఇదే మొదటిదని, వీరిలో 408 మంది యాత్రికులు తెల్లవారుజామున 3.35 గంటలకు 24 వాహనాల కాన్వాయ్ ఎస్కార్ట్‌తో బయలు దేరారని, మరో 1,269 మంది 43 వాహనాల ఎస్కార్ట్‌తో సౌత్ కశ్మీర్ పహల్‌గావ్ బేస్ క్యాంపు నుంచి బయలుదేరారని వారు తెలిపారు.

సీఏపీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసుల విస్తృత భద్రతా ఏర్పాట్ల కారణంగా ఈ ఏడాది యాత్ర సజావుగా, ప్రశాంతంగా జరుగుతున్నట్టు ఎస్ఏఎస్‌బీ ప్రకటించింది. 52 రోజుల పాటు సాగే అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 29వ తేదీతో ముగుస్తుంది. అదే రోజు శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్‌ పండుగలు జరుపుకొంటారు.