News

రామేశ్వరం గుడిలో బిహారీ భక్తుడిపై ఆలయ ఉద్యోగుల దాడి

59views

తమిళనాడులోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామేశ్వరం ఆలయంలో ఒక భక్తుడిపై ప్రభుత్వోద్యోగులు దాడి చేసిన ఘటన వివాదానికి దారితీసింది. దేవదాయశాఖ సూపర్‌వైజర్, గుడి ఉద్యోగులు కలిసి దాడి చేసారు. ఆ సంఘటన జులై 15న జరిగింది.

నిఖిల్ కుమార్ ఓఝా (29) బిహార్‌ నుంచి తమిళనాడు వెళ్ళిన వలసకార్మికుడు. ప్రస్తుతం తిరుప్పూరులో నివసిస్తున్నాడు. జులై 15న అతను తన తల్లి, చెల్లితో కలిసి రామేశ్వరం గుడికి వెళ్ళాడు. ఉదయం 11.30 సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందంటూ గుడిలోని దేవదాయశాఖ ఉద్యోగులు భక్తులను నెడుతున్నారు. ఆ క్రమంలో మహిళలను, పిల్లలను తగని రీతిలో తాకుతూ తోసివేసారు. నిఖిల్ వారి ప్రవర్తనకు అభ్యంతరం చెప్పాడు. దాంతో వారిమధ్య వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలో దేవదాయశాఖ సూపర్‌వైజర్‌, మరికొందరు ఆలయ ఉద్యోగులు నిఖిల్‌పై భౌతికదాడికి పాల్పడ్డారు, రక్తమొచ్చేలా కొట్టారు. ఆ క్రమంలో నిఖిల్‌ నుదుటిపైన, ముఖం పైన బలమైన గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని నిఖిల్‌ను విడిపించారు. ఆ వ్యవహారం మీదా, దేవాలయ ఉద్యోగుల నిర్వాకం మీదా నిఖిల్ రామేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

తమిళనాడులోని ప్రముఖ హిందూసంస్థ ‘హిందూ మున్నని’ ఆ సంఘటనను తీవ్రంగా ఖండించింది. ‘‘ఒక భక్తుడిని రక్తమోడేలా గుడిలోని ఉద్యోగులు అమానుషంగా కొట్టడం క్రూరమైన చర్య. ఇటీవలి కాలంలో రామేశ్వరం గుడిలో అటువంటి ఉద్యోగుల కారణంగా భక్తుల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ఆ దాడిచేసిన ఆలయోద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అసలు ఆలయంలో ఉద్యోగులు ఉన్నది భక్తులను రక్షించడానికా లేక వారిపై దాడులు చేయడానికా?’’ అంటూ రామనాథపురం జిల్లా హిందూమున్నని అధ్యక్షుడు ప్రభాకరన్ ఆవేదన వ్యక్తం చేసారు.

తమిళనాడులోని నాస్తిక ప్రభుత్వం దేవాలయాలను కేవలం ఆదాయాలు సంపాదించుకునే మార్గాలుగా మాత్రమే చూస్తోంది. గుడుల్లో సంప్రదాయాలు, ఆచారవ్యవహారాల పరిరక్షణ గురించి పట్టించుకోవడం లేదు. అంతమాత్రమే కాదు, దేవదాయశాఖ ఉద్యోగులు, అధికారులు భక్తులను హింసిస్తున్నా పట్టించుకోవడం లేదు. సమీప గతంలో సైతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులపై దేవదాయశాఖ ఉద్యోగులు దాడులు చేసిన ఘటనలు నమోదయ్యాయి.