NewsProgramms

సానుకూల ఫలితాలు ఇస్తున్న ప్లాస్టిక్ వ్యతిరేక చైతన్యం

74views

నంద్యాల సంఘమిత్ర సేవా సమితి ప్రారంభించిన ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారం సానుకూల ఫలితాలను అందిస్తోంది. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం నంద్యాల వాసులు బాధ్యతగా కృషి చేస్తున్నారు. స్థానిక పద్మావతినగర్‌లోని శ్రీకృష్ణ మందిరంలో సంఘమిత్ర సేవా సమితి ఏర్పాటు చేసిన 4వ చైతన్య సదస్సులో పట్టణవాసులు తమ విజయాలను పంచుకున్నారు.

తమ ఫంక్షన్ హాలులో జరిగే పెళ్లిళ్ళు, పుట్టిన రోజు వంటి వేడుకల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని సంఘమిత్ర క్రియాశీలక సభ్యులు, జయంతా వెజ్ వరల్డ్ నిర్వాహకులు సముద్రాల నాగ రాజయ్య తెలిపారు. ప్లాస్టిక్ కప్పులు, గ్లాసులను వాడడం లేదని తద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను పర్యావరణంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటున్నామని..ఇది తమకు ఎంతో ఆనందకరంగా ఉందని ఆయన తెలిపారు.

శ్రీ కృష్ణ మందిరం నిర్వాహకులు సైతం ప్లాస్టిక్ రహిత జీవనం వైపు మళ్లేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా, తమ మందిరంలో జరగనున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో 600 మందికి పైగా భక్తులు పాల్గొంటారని..ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. సదస్సులో పాల్గొన్న మహిళలు తమ అపార్ట్‌మెంట్లలో నిర్వహించే కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీలు గ్లాసులు, ప్లేట్లను ఉమ్మడిగా సమకూర్చుకున్న విషయాన్ని సభికుల దృష్టికి తీసుకొచ్చారు. అలాగే, ప్లాస్టిక్ కవర్ల స్థానంలో జనపనారతో తయారు చేసిన సంచులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుల్లో సంఘమిత్ర కార్యవర్గ సభ్యులు పృథ్వీరాజ్ యాదవ్, శ్రీ కృష్ణ మందిరం కమిటీ సభ్యులు, పలువురు పర్యావరణ ప్రేమికులు, మాతృమూర్తులు పాల్గొన్నారు.