News

మడ అడవుల జీవ వైవిధ్య సౌందర్యం

45views

దేశంలో తూర్పు నదీ తీర పరీవాహక ప్రాంతంలో నెలకొన్న మడ అడవులు(మాంగ్రూవ్స్‌) జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. దేశంలో కోల్‌కతాలోని సుందర్‌బన్స్‌ తరువాత కోరంగి మడ అడవులు రెండవ స్థానాన్ని ఆక్రమించాయి. 235.70 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న కోరంగి మడ అటవీ ప్రాంతాన్ని వైల్డ్‌ లైఫ్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ 1972 ప్రకారం కోరింగ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురీగా ప్రకటించారు. కోరంగిలోని మడ అడవులు కాకినాడలోని పగడాలపేట వద్ద ప్రారంభమై తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలం పండి, పోర, ఎస్‌.యానాం వరకు దాదాపు 75 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి నది గౌతమి, వైనతేయ, వశిష్ఠ పాయలుగా విడిపోయి సముద్రంలో కలిసే తీర ప్రాంతంలో ఈ మడ అడవులు వ్యాపించి ఉన్నాయి. ఆయా నదుల నుంచి నీరు సముద్రంలో కలిసే ప్రాంతంలో మడ అడవులు విస్తారంగా పెరుగుతాయి. మడ అడవులు ప్రత్యక్షంగా పశుగ్రాసం, వంట చెరకు వంటి ప్రయోజనాలను చేకూర్చడంతోపాటు పరోక్షంగా మత్స్యసంపద అందిస్తాయి. తుపానులు, వరదల నుంచి తీర ప్రాంత గ్రామాలకు, ప్రజలకు రక్షణ చేకూరుస్తున్నాయి. ఇక్కడి మొక్కలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అనేక జాతుల వన్యప్రాణులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. దూర తీరాల నుంచి వలస పక్షులు ఇక్కడకు వచ్చి సంతానోత్పత్తి చేయడం విశేషం. పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదం చేసే ఆలివ్‌ రిడ్లీ తాబేళ్లు, ఫిషింగ్‌ క్యాట్‌, ఇండియన్‌ స్మూత్‌ కోటెడ్‌ ఓటర్స్‌ ఆవాసంగా ఉంటాయి. కాలుష్యం, భూమి కోత, తుపాను తాకిడి, అడవులు నరికివేసి చేపలు, రొయ్యలు చెరువులు తవ్వడం వంటి చర్యల వల్ల మడ అడవులు క్రమేణా తరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి సంరక్షణకు ప్రభుత్వం పర్యావరణ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసింది. మడ అడవులపై ఆధారపడకుండా సమీప గ్రామస్తులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కార్యకలాపాలను అందిస్తున్నారు. మడ అటవీ సంపదను కాపాడేందుకు ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం కోరంగి బయో డైవర్సిటీ సెంటర్‌లో నిర్వహించిన వరల్డ్‌ మంగ్రూవ్స్‌ డే కార్యక్రమానికి వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.