News

గణేష్‌ ఉత్సవాలు భక్తిభావం చాటాలి

64views

భక్తి భావం చాటేలా వినాయక చవితి, నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలని, ఇందుకు వినాయక మంటపాల నిర్వాహకులంతా సహకరించాలని అనంతపురం జిల్లా ఎస్పీ వి.రత్న కోరారు. శుక్రవారం హిందూపురంలోని రైల్వేరోడ్డు కేవీఆర్‌ ఫంక్షన్‌ హాలులో వినాయక మంటపాల నిర్వాహకులతో పీస్‌ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్పీ రత్న, డీఎస్పీ కంజాక్షన్‌, ట్రాన్స్‌కో ఏఈ ఝన్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. హిందూపురాన్ని శాంతిపురంగా చూద్దామన్నారు. హైదరాబాద్‌లా గొప్పగా వినాయక చవితి, నిమజ్జనం జరుపుకుందామని పిలుపునిచ్చారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఏటా ఎదుర్కొనే సమస్యలు గుర్తించి విగ్రహాల ఎత్తు 18 అడుగులకు మించకుండా చూడాలన్నారు. అలాగే చెవులు చిల్లులు పడేలా డీజేలు, సౌండ్స్‌ వద్దన్నారు. నిర్దేశించిన మార్గంలోనే గణేష్‌ శోభయాత్ర సాగాలన్నారు. శోభయాత్ర సమయంలోనూ కరెంట్‌ సరఫరాకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. అనంతరం నిర్వహకులు, పట్టణ ప్రముఖులు తమ సందేహాలు, సూచనలు అధికారులకు వివరించారు.