ArticlesNews

కార్గిల్ విజయ్ దివస్ : అమర జవాన్లకు అంజలి

100views

( జూలై 26 – కార్గిల్ విజయ్ దివస్ )

భారత్ మీద వెయ్యేళ్ల జిహాద్‌ను ప్రకటించిన దేశం పాకిస్తాన్. భారత్‌తో 1947, 1965, 1971 యుద్ధాలలో చిత్తుగా ఓడినా 1999లో కార్గిల్ ఘర్షణకు దిగి మరోసారి భంగపడింది. కార్గిల్ యుద్ధం హఠాత్తుగా జరిగింది కాదు. దానికి ఎంతో పూర్వ చరిత్ర ఉంది. కార్గిల్ పూర్వం జమ్మూకాశ్మీర్ సంస్థానంలోని గిల్గిత్-బాల్టిస్తాన్ జిల్లాలో భాగం. 1947లో కాశ్మీర్ సంస్థానం భవిష్యత్తును తేల్చడంతో జరిగిన జాప్యాన్ని ఆసరగా చేసుకొని గిరిజనుల ముసుగులో పాక్ సైన్యం దురాక్రమణకు దిగింది. అదే సమయంలో కాశ్మీర్‌ను మహారాజా హరిసింగ్ భారత్‌లో విలీనం చేయడంతో పాక్ మూకలను మన ఆర్మీ తరిమికొట్టింది. ఈ సందర్భంగా జరిగిన పరిణామాల్లో నియంత్రణ రేఖ బాల్టిస్తాన్ జిల్లా మీదుగా వెళ్లగా కార్గిల్ ప్రాంతం భారతదేశంలోని జమ్మూకాశ్మీర్‌లో భాగమైంది. ప్రస్తుతం ఇది లద్దాక్ పరిధిలో ఉంది. శ్రీనగర్ – లెహ్‌లను కలిపే జాతీయ రహదారి కార్గిల్ మీదుగా పోతుంది. అందుకే, వ్యూహాత్మకంగా భారత్‌కు కార్గిల్ కీలకమైన ప్రాంతం.

భారత్, పాకిస్తాన్‌ల సరిహద్దు వివాదానికి మూలం సియాచిన్ హిమనీ నదం. ఇది నివాస యోగ్యం కాదు. అయితే 1949 కరాచీ ఒప్పందం, 1972 సిమ్లా ఒప్పందంలో ఈ సియాచిన్ ఏ దేశానికి చెందుతుందో ప్రస్తావించ లేదు. ఆరంభంలో దీన్ని ఇరు దేశాలు తటస్థ భూమిగా భావించాయి. అయితే కాశ్మీర్ పై పట్టు సాధించే క్రమంలో సియాచిన్ ప్రాధాన్యతను గుర్తించిన పాకిస్థాన్ దీన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేపట్టింది. సిమ్లా ఒప్పందం ప్రకారం భారత్, పాకిస్తాన్‌లు చలికాలంలో సియాచిన్ ప్రాంతం నుంచి సైనికులను ఉపహరించుకుంటాయి. దీన్నే పాకిస్తాన్ అవకాశంగా తీసుకొని భారత్ సైన్యం లేని సమయంలో ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం ప్రారంభించింది. ఈ పన్నాగాలను గ్రహించిన భారత సైన్యం 1984 ఏప్రిల్ 13న ఆపరేషన్ ‘మేఘదూత్’ చేపట్టి సియాచిన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో అహం దెబ్బతిన్న పాక్ సేనలు నాటి నుంచి ప్రతీకారం కోసం ఎదురు చూడడం ప్రారంభించారు.

భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న పాక్..లాహోర్ చర్చల సమయంలో మరో కుట్రకు తెర తీసింది. అదే ‘ఆపరేషన్ బ్ర’. కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను విడదీసి, భారత సైన్యాన్ని సియాచిన్ నుండి వెనక్కు పంపడం, కాశ్మీర్ సరిహద్దు పరిష్కారం పేరుతో భారత్‌ను అంతర్జాతీయ వేదికలపై ఇరుకున పెట్టడమే ఈ ఆపరేషన్ లక్ష్యం. ఇందులో భాగంగానే, 1993 మే 3న పాకిస్తాన్‌కు చెందిన 6 నార్తర్న్ లైట్ ఇన్ఫాంట్రీ సైనికులు దాదాపు 1700 మంది ముజాహిద్దీన్ల ముసుగులో సరిహద్దు దాటి 8 కిలోమీటర్లు లోనికి చొరబడ్డారు. లెహ్‌ను శ్రీనగర్ నుంచి వేరు చేయడం ద్వారా వాస్తవాధీన రేఖ రూపురేఖలను మార్చాలన్నదే వీరి లక్ష్యం.

సరిహద్దుల్లో అనుమానిత వ్యక్తులు కనిపించారని తాషీనామ్ గ్యాల్ అనే పశువుల కాపరి భారత గస్తీ దళాలకు సమాచారం ఇచ్చాడు. దీంతో మే 5న మన సైన్యం కెప్టెన్ సౌరబ్ కాలియా నాయకత్వంలో ఐదుగురు సైనికుల గస్తీ దళాన్ని ఆ ప్రాంతానికి పంపించగా పాక్ సైన్యం వీరిని చంపేసింది. ద్రాస్, కక్సార్, ముషో సెక్టార్లలో చొరబాట్లు జరిగాయని భారత సైన్యం గుర్తించే లోపే మే 9న పాకిస్తాన్ సైన్యం చేసిన శతఘ్ని దాడిలో కార్గిల్ ఆయుధాగారం ధ్వంసం అయింది. అలా పాక్ ధోరణితో 1999లో రెండు దేశాల మధ్య నాల్గవసారి యుద్ధానికి తెర లేచింది. పాకిస్తాన్ చొరబాట్లకు బుద్ధి చెప్పడమే లక్ష్యంగా భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ మొదలు పెట్టింది. పెద్ద సంఖ్యలో సైనికుల్ని కార్గిల్‌కు తరలించింది.

చొరబాటుదారులపై భారత వాయుసేన దాడులు మే 26న మొదలయ్యాయి. ఇదే ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’. మిరాజ్ 2000 ఫైటర్ జెట్ల సహాయంతో వైమానికదళం శత్రుసైన్యం పై బాంబుల వర్షం కురిపించి కొన్ని స్థావరాలను నేలమట్టం చేసింది. అయితే మే 27న భారత వాయుసేన ఒక మిగ్ 21ను, ఒక మిగ్ 27ను కోల్పోయింది. ఫ్లైట్ లెఫ్టినెంట్ నచికేత యుద్ధ ఖైదీగా పట్టుబడ్డారు. మే 28న ఎం.ఐ. 17 హెలికాఫ్టర్‌ను పాకిస్తాన్ కూల్చివేసింది. నలుగురు సిబ్బంది మరణించారు. జూన్ 1న పాకిస్తాన్ తన దాడులను ముమ్మరం చేసింది. జాతీయ రహదారి 1ఏ పై బాంబుల వర్షం కురిపించింది. జూన్ 6 నుంచి భారత సైన్యం పెద్ద ఎత్తున దాడులను ప్రారంభించింది. ద్రాస్‌లోని టైగర్ హిల్, టోలోలింగ్ పర్వతాల మీద గురి పెడుతూ దాడులను తీవ్ర తరం చేసింది. జూన్ 9న బటాలిక్ సెక్టారులోని రెండు కీలక స్థావరాలను భారత సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. జూన్ 14న సముద్ర మట్టానికి 16 వేల అడుగుల ఎత్తులో ఉన్న టోలోలింగ్ పర్వత శిఖరాన్ని స్వాధీనం పరచుకొని జాతీయ జెండా ఎగురవేశారు.

టోలోలింగ్ గెలుపుతో సైన్యం స్థైర్యం పెరగడమే కాదు ఇక్కడి నుంచి లద్దాక్ మార్గం జాతీయ రహదారి 1డి, దారి పరిసర ప్రాంతాల్లోని స్థావరాలను జూన్ మధ్యనాటికి తిరిగి స్వాధీనం చేసుకుంది. తర్వాత టైగర్ హిల్స్ పై దృష్టి పెట్టి కీలక స్థావరాలైన పాయింట్ 5060, పాయింట్ 5100 లను స్వాధీనపరుచుకుంది. జూలై 2 త్రిముఖ దాడిని మొదలు పెట్టి జూలై 4 కల్లా టైగర్ హిల్స్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. జూలై 5న ద్రాస్ సెక్టార్, జూలై 7న బటాలిక్ సెక్టార్లపై పూర్తి నియంత్రణ సాధించింది. అనంతరం 3 రోజుల పాటు భీకర యుద్ధం చేసి జూలై 11న పాయింట్ 4875 సైతం స్వాధీనం చేసుకుంది. బటాలిక్‌లోని కీలక శిఖరాలను భారత సైన్యం స్వాధీనపరచుకోవడంతో పాకిస్తాన్ వెనక్కి వెళ్లడం ప్రారంభించింది.

జూలై 14న ఆపరేషన్ విజయ్ విజయవంతం అయిందని నాటి భారత ప్రధాని వాజ్‌పేయి ప్రకటించారు. జూలై 26న యుద్ధం అధికారికంగా ముగిసింది. పాకిస్తాన్ చొరబాటుదారులను పూర్తిగా వెళ్లగొట్టామని భారత సైన్యం ప్రకటించింది. దాదాపు 2 నెలల 20 రోజుల తర్వాత పాక్ సైన్యం పూర్తిగా వెనక్కి తగ్గింది. దాదాపు 130 స్థావరాలను భారత సైన్యం తిరగి స్వాధీనం చేసుకుంది. ఈ విజయ సాధనలో 527 మంది సైనికులు బలిదానం చేశారు.1,363 మంది గాయపడ్డారు. సైన్యానికి అవసరమైన ఆయుధ, ఆహార సరఫరా అందించిన ‘టండా టైగర్’ దళంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది గాయపడ్డారు. వీరంతా అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు, భాషలు, మతాలు, కులాలకు చెందినవారు. కార్గిల్ కదనంలో భారత సైనికులు చూపిన పరాక్రమం, ధైర్యసాహసాల గురించి ఎంత చెప్పినా తక్కువే. 1999 నుంచి కార్గిల్ విజయాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా జూలై 26న విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నాము. దేశం కోసం అంతిమ త్యాగం చేసిన భారత సైనికులకు నివాళులు అర్పిస్తూ, వీర సైనికుల వీరోచిత త్యాగాలను మరోసారి స్మరించుకుందాం. అంజలి ఘటిదాం..