News

వెయ్యేళ్ల నాటి పద్ధతిలో…. ఆలయ మరమ్మత్తులు

65views

తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయ పైకప్పు బీటల మరమ్మతు పనులు పురాతన నిర్మాణశైలిలో సాగుతున్నాయి. ఐఐటీ నిపుణుల పర్యవేక్షణలో ప్రాచీన పద్ధతుల్లో సహజ పదార్ధాలతోనే ఈ పనులు జరుగుతున్నాయి. పూణెకి చెందిన భక్తులు దాదాపు రూ. అయిదు కోట్ల వ్యయంతో ఈ పనులు చేయిస్తున్నారు. కొన్నేళ్ల కిందట ముక్కంటి ఆలయం పైకప్పుకు పగుళ్లువారి వాన కురిస్తే నీరు కారేది. స్వామి అమ్మవార్ల గర్భాలయ సన్నిధిలో వర్షపునీరు కారేది. ఆలయ అధికారులను, భక్తులను ఈ పరిణామం కలవరపరిచింది. పురాతన ఆలయానికి మరమ్మతు పనులు ఆధునిక పద్ధతిలో చేపడితే ప్రాచీనతకు భంగం వాటిల్లుతుంది. ఈ సమయంలో మసూరులోని కేంద్ర ఆర్కియాలజీ శాఖలో ఎపిగ్రఫీ విభాగ జాతీయ డైరెక్టర్‌గా ఉన్న తిరుపతి వాసి మునిరత్నంరెడ్డి చొరవ తీసుకున్నారు. భారతీయ ప్రాచీన నిర్మాణ పద్ధతులు అనుసరించి మరమ్మతులకు పూనుకోవాలని సూచించారు. పూణెకు చెందిన వ్యాపారి వెంకటేశ్వరరావు అనే భక్తుడిని ఆయన సంప్రదించారు. ఉత్తరాదేవి చారిటబుల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలు సాగిస్తున్న ఆయన ఈ మరమ్మతు పనులకయ్యే ఖర్చు భరించేందుకు ముందుకొచ్చారు. ఏడాది పాటు ఐఐటీ నిపుణులతో అఽధ్యయనం చేయించారు. వెయ్యేళ్ల క్రితం నాటి పురాతన విధానంతో శాస్త్రీయంగా పనులు చేపట్టాలని నిర్ణయించి బుధవారం పనులు ప్రారంభించారు.

ఎలా చేస్తారంటే..
సిమెంటు, ఆధునిక రసాయన లీకేజీ ప్రూఫ్‌లు మరమ్మతు పనుల్లో వాడకూడదని నిర్ణయించుకున్నారు. వెయ్యేళ్ల క్రితం నిర్మాణాలు జరిగిన పద్ధతిలోనే ఒక మిశ్రమం తయారు చేసుకుంటున్నారు. సున్నం, బెల్లం, కరక్కాయ పొడి, కాల్చిన మట్టి, ఇటుక ముక్కలు, ఇటుకల పొడితో పాటూ అరబ్బు దేశాల నుంచి దిగుమతి చేసుకున్న బంక ( ఆ ప్రాంతపు చెట్ల నుంచి సేకరించేది) వాడుతున్నారు.వేర్వేరు డ్రమ్ముల్లో వీటిని నానబెట్టుకున్నాక సమపాళ్లలో ఇసుకతో కలిపి ఒక మిశ్రమం సిద్ధం చేసుకుంటున్నారు. పూణె నుంచి వచ్చిన నిపుణులైన కార్మికులు ఆలయం పైకప్పుపై ఈ పనులను చేస్తున్నారు. పనులు పూర్తయ్యేందుకు నెలరోజులు పడుతుందని అంచనా. ఆలయ అధికారులు వీరికి సహకరిస్తున్నారు.