News

చైనీయుడిని కాపాడేందుకు.. భారత నేవీ సాహసోపేత ఆపరేషన్‌

57views

నౌకలో తీవ్రంగా గాయపడిన చైనా జాతీయుడిని రక్షించేందుకు భారత నౌకాదళం సాహసోపేత ఆపరేషన్‌ చేపట్టింది. ముంబయికి 200 నాటికల్‌ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న చైనా సరకు రవాణా నౌక సిబ్బంది తమలో ఒక వ్యక్తి గాయపడినట్టు అత్యవసర సందేశం పంపింది. దీంతో రంగంలోకి దిగిన భారత నేవీ అతడిని కాపాడింది. తీవ్ర రక్తస్రావమైన అతడికి అత్యవసర చికిత్స అవసరం కావడంతో ఆసుపత్రికి తరలించింది.

చైనాకు చెందిన ఝాంగ్‌ షాన్‌ మెన్‌ అనే సరకు రవాణా నౌక.. ముంబయి తీరానికి సుమారు 200 నాటికల్‌ మైళ్ల (సుమారు 370 కి.మీ) దూరంలో ఉన్నప్పుడు.. ఆ నౌక నుంచి ముంబయిలోని మారిటైం రెస్క్యూ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (MRCC)కు ఎమర్జెన్సీ కాల్‌ వచ్చింది. నౌకలో ఓ నావికుడి (51)కి అత్యవసర చికిత్స అవసరమని విజ్ఞప్తి చేసింది. దీంతో రంగంలోకి దిగిన భారత నావికాదళం.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సీ కింగ్‌ హెలికాప్టర్‌తో సాహసోపేత ఆపరేషన్‌కు సిద్ధమైంది. తీవ్ర గాలులు, నౌకపై దిగేందుకు అనుకూల పరిస్థితులు లేనప్పటికీ అతడికి కాపాడేందుకు తీవ్రంగా శ్రమించింది. తీవ్ర రక్తస్రావమైన ఆ బాధితుడిని చివరకు ఎయిర్‌లిఫ్ట్‌ చేసి తీరానికి తీసుకువచ్చినట్లు భారత నావికాదళం తెలిపింది.
అనంతరం క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించినట్లు నావికాదళం వెల్లడించింది. ఈ క్రమంలో ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌కు చెందిన (ICGS) సామ్రాట్‌ నౌకను కూడా సాయం కోసం మళ్లించినట్లు తెలిపింది. భారత నౌకాదళంతో సమన్వయం చేసుకుంటూ ఎంఆర్‌సీసీ చేపట్టిన ఈ సంయుక్త ఆపరేషన్‌తో చైనీయుడిని సకాలంలో ఆసుపత్రికి తరలించి కాపాడినట్లు భారత నౌకాదళం వెల్లడించింది.