News

ఆర్‌ఎస్‌ఎస్‌ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ తో శేఖర్‌ భేటీ

59views

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తమిళనాడు, పుదుచ్చేరి సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ సర్ సంఘచాలక్ పూజ్య మోహన్‌ భాగవత్‌తో సోమవారం భేటీ అయ్యారు. చెన్నై వచ్చిన మోహన్‌ భాగవత్‌ను కలుసుకుని స్వామివారి ప్రసాదాలు అందించారు. అనంతరం తమిళనాట టీటీడీ చేపట్టిన పలు కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా శేఖర్‌ వివరించారు. 2016లో తాను టీటీడీ బోర్డు సభ్యునిగా ఉన్నప్పుడు దేశంలోనే ప్రప్రథమంగా అలిపిరిలో ‘గోమందిరం’ నిర్మించినట్టు వివరించారు. ఐదెకరాల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ గోమందిరంలో వేలాదిమంది భక్తులు గోపూజ సేవ, గోప్రదక్షిణం, గో తులాభారం వంటి కార్యక్రమాలను నిర్వహించిన తరువాతే శ్రీవారిని దర్శించుకుంటున్నారని వివరించారు. ఈ గోమందిరంలో సదుపాయాల కోసం రూ.15 కోట్లు విరాళంగా ఇచ్చినట్టు పేర్కొన్నారు. గోమందిర ప్రాంగణంలో ప్రతిరోజూ ‘శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం’ జరుగుతోందని, వందలాదిమంది భక్తులు ఈ హోమంలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఇక్కడ హోమం కోసం తన సొంత ఖర్చుతో మండపం నిర్మించనున్నామని, భూమి పూజ కోసం ఏర్పాట్లు సిద్ధమయ్యాయన్నారు. అదేవిధంగా చెన్నైలో నిర్మితమైన పద్మావతి అమ్మవారి ఆలయం, కన్నియాకుమారి, వేలూరు, ఉళుందూర్‌పేటలోని ఆలయాల నిర్మాణంలో తన సహకారం గురించి కూడా వివరించారు. అంతేగాక తమిళనాడు నుంచి తిరుమలకు వెళ్లే పాదయాత్రికుల కోసం విశ్రాంతి కేంద్రాలను నిర్మించాలనే తన కలల ప్రాజెక్టును నెరవేర్చాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. పురటాసి మాసంలో తమిళనాడు నుంచి వేలాదిమంది భక్తులు చెన్నై నుంచి తిరుపతికి, ఇతర జిల్లాల నుంచి చిత్తూరు మీదుగా తిరుమలకు పాదయాత్రగా వెళ్లేటప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నందున, ఈ మార్గాల్లో ప్రతి 25 కి.మీటర్లకు ఒకటి చొప్పున విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిఉందన్నారు. ఇందుకోసం ఒక్కో కేంద్రానికి ఒక్కో ఎకరా చొప్పున భూమిని కూడా గుర్తించామని పేర్కొన్నారు. ఈ వివరాలను ఆసక్తిగా ఆలకించిన మోహన్‌ భగవత్‌.. శేఖర్‌ను అభినందించారు.