ArticlesNews

మొహర్రం ఊరేగింపు : పాలస్తీనా జెండాల ప్రదర్శనలు.. కేసులు నమోదు

173views

మొహర్రం సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో హిందూ వ్యతిరేక సంఘటనలు నమోదయ్యాయి. బిహార్‌, యూపీ, కాశ్మీర్‌, గుజరాత్‌తో సహా వివిధ రాష్ట్రాలలో ఈ ఘటనలు జరిగాయి. గుజరాత్‌లోని వడోదరలో మొహర్రం సందర్భంగా ఛాందసులు పాలస్తీనా జెండాను ఎగరేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముస్లింలు అధికంగా నివసించే సావ్లీలో ఇది జరిగింది. పాలస్తీనా జెండాను ఎగరేయగానే.. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు జెండాను తొలగించారు. ఈ ఘటనకి సంబంధించి ముగ్గురు మైనర్లను పోలీసులు విచారించారు. కానీ ఇప్పటి వరకూ ఎవ్వర్నీ అరెస్ట్‌ చేయలేదు.

ఇక మరో ఘటన కూడా జరిగింది. బిహార్‌లో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. మొహర్రం సమయంలో ఇక్కడా పాలస్తీనా జెండాలు ఎగరేశారు. అంతేకాకుండా మొహర్రం ఊరేగింపులో పాల్గొన్న వారు పాలస్తీనా నేపథ్యం వున్న దుస్తులను కూడా ధరించారు. దీంతో కైమూర్‌ యంత్రాంగం అలర్ట్‌ అయ్యింది. మూడు రోజుల క్రితం కైమూర్‌లోని ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌ లో పాలస్తీనాకి చెందిన టీ షర్టులు తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. మొహర్రం ఊరేగింపులో ఎవరైనా అభ్యంతరకరమైన వస్తువులతో పట్టుబడితే మాత్రం ఉపేక్షించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు.

యూపీలో కూడా మొహర్రం సందర్భంగా ఊరేగింపులో పాలస్తీనా జెండాలు కనిపించాయి., దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌ అవుతోంది. లౌడ్‌ స్పీకర్లున్న వాహనంపై పాలస్తీనా జెండా ప్రదర్శించి, నినాదాలు చేశారు.

జమ్మూ కశ్మీర్‌లో కూడా మొహర్రం సందర్భంగా పాలస్తీనా జెండాలు కనిపించాయి.ఈ జెండాలను ఎగరేసిన వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఊరేగింపులో కొందరు యువకులు అమెరికా, ఇజ్రాయిల్‌ వ్యతిరేక నినాదాలు చేస్తూ హల్‌చల్‌ సృష్టించారు. ఇలాంటి ఘటనలు మొహర్రం సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగాయి. దీంతో అధికార యంత్రాంగం కూడా అలర్ట్‌ అయ్యింది.