News

ఎవరీ ఉషా చిలుకూరి..?? విశాఖతో ఆమెకున్న అనుబంధం ఏంటి…?? ప్రొ.శాంతమ్మతో బంధం ఎలా..??

261views

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్‌ను ఎంపిక చేయడంతో ఆయన భార్య ఉషా చిలుకూరి పేరు ఒక్కసారిగా మార్మోగిపోతోంది. ఉషకు విశాఖపట్నంలో బంధువులున్నారు. తొమ్మిది పదుల వయసులోనూ విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్‌ శాంతమ్మకు ఉష మనవరాలి వరుస అవుతారు. శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి. తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయన, కొన్ని సంవత్సరాల క్రితం మరణించారు. సుబ్రహ్మణ్యశాస్త్రి సోదరుడు రామశాస్త్రి. ఈయన కుమారుడు రాధాకృష్ణ సంతానమే ఉష.

ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి: ఉష భర్త జేడీ వాన్స్‌ను అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేయడంపై శాంతమ్మ సంతోషం వ్యక్తం చేశారు. ఉష తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారని, ఆమె అక్కడే పుట్టి పెరగడంతో పరిచయం తక్కువేనన్నారు. వాన్స్‌ అభ్యర్థిత్వం, మా బంధుత్వం గురించి తెలిశాక పలువురు ఫోన్‌లో అభినందనలు తెలిపారని చెప్పారు.
చెన్నైలో వైద్యురాలిగా ఉన్న ఉష మేనత్త శారద, వాన్స్, ఉషల వివాహానికి హాజరైనట్లు గుర్తు చేసుకున్నారు.‘మా బంధువులు అమెరికాలో వివిధ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారు. ఉష దంపతులు ఈ స్థాయికి వెళ్లారని తెలియగానే సంతోషంగా, గర్వంగా అనిపించింది. అమెరికా ఉపాధ్యక్షుడి భార్య అయితే ఎక్కువ, లేకపోతే తక్కువ అని కాకుండా నా ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉంటాయి’ అని శాంతమ్మ వివరించారు.

విశాఖకు రావాలని ఆహ్వానిస్తాం: ఉష దంపతులు మన దేశంలో ఉండి ఉన్నతస్థాయికి వెళ్తే మరింత గర్వంగా ఉండేదని శాంతమ్మ పేర్కొన్నారు. వాన్స్‌ తప్పనిసరిగా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో గెలిచి మన దేశానికి సహకారం అందించాలని, భరోసాగా నిలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికల తర్వాత వారిని విశాఖకు ఆహ్వానిస్తామన్నారు.

ఈమధ్య కాలంలో మతమార్పిడులు ఎక్కువయ్యాయని, హిందువుల సంరక్షణకు, హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని ఉషకు నా తరఫున సందేశమిస్తానన్నారు. 96 ఏళ్ల ప్రొఫెసర్‌ శాంతమ్మ గతేడాది వరకు విశాఖ నుంచి విజయనగరంలోని సెంచూరియన్‌ విశ్వవిద్యాలయంలో బోధించడానికి వెళ్లేవారు. ప్రస్తుతం పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేయాలని భావిస్తున్నారు.
ఉషా చిలుకూరి కృష్ణా జిల్లా ఆడపడుచు. ఆమె మూలాలు ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలో ఉన్నాయి. ఉషకు తాత వరుస అయిన చిలుకూరి రామ్మోహనరావు కుటుంబం ప్రస్తుతం ఇక్కడ నివాసం ఉంటోంది.