ArticlesNews

అద్భుతం.. అపురూపం మహానంది శిల్పసంపద

58views

నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శిల్పసంపదను చూసిన భక్తులు మంత్ర ముగ్ధులవుతున్నారు. ప్రతి శిల్పం జీవకళతో ఉట్టిపడుతూ శిల్పుల పనితనానికి అద్దం పడుతోంది. ఏకశిలపై సరస్వతీదేవి, భూదేవి, శ్రీదేవి సహిత విష్ణుమూర్తి శిల్పాలు రూపుదిద్దుకున్నాయి. పంచపడగలతో నాగబంధం, దశవతారాలు, రాణి అద్దంతో చూసుకుంటూ అలంకరించుకోవడం, దేవలోక నాగకన్యలు, నారీమణులతో ఏనుగు శిల్పం భక్తుల చూపును కట్టిపడేస్తున్నాయి.

దేవతా మూర్తులతో పాటు జాతీయ నాయకులైన గాంధీ, నెహ్రూ శిల్పాలను చెక్కి శిల్పులు దైవభక్తితో పాటు దేశభక్తిని చాటుకున్నారు. మహానంది ఆలయ ధర్మకర్తగా 1902 నుంచి 1947 వరకు భైరవజోష్యులు మహానందయ్య పనిచేశారు. ఈయన గుంప్రమానుదిన్నెకు చెందిన బాలవీరాచారితో శిల్పాలను చెక్కించారు. శారదా శిల్పకళా మందిరాన్ని స్థాపించిన బాలవీరాచారి, తన సోదరులు పోతులూరయ్యాచారి, కృష్ణమూర్తి ఆచారి, వీరభద్రాచారితో కలసి 1948లో శిల్పాలు చెక్కడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఐదేళ్లపాటు నిరంతరం శ్రమించి శిల్పాలకు జీవం పోశారు. గుంప్రమానుదిన్నె నుంచి ప్రతిరోజూ రావడం కష్టంగా ఉండటంతో మహానంది మండలం సీతారామాపురంలో ఉంటూ సైకిళ్లపై మహానందికి వచ్చి శిల్పాలు చెక్కేరవాని వారి పూర్వీకులు చెప్పారు.

అప్పట్లో రోజుకు రూ. 0.75 పైసల వేతనంతో పనిచేశారు. శిల్పులకు రూ. 0.75 పైసలు, మిగిలిన కూలీలకు రూ. 0.25 పైసలు చెల్లించేవారు. ఈ శిల్పాలను అందంగా చెక్కి అపురూపంగా తీర్చిదిద్దడంతో శిల్పుల పనితనం మెచ్చిన మహానందయ్య శిల్పులకు ఎకరా భూమి రూ. 100 చొప్పున 12 ఎకరాలు కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారని బాలవీరాచారి కుమారుడు రవీంద్రాచారి తెలిపారు. మహానందిలోని శిల్పాలతో పాటు వారు 1965లో శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబిక సింహ స్థంభాల మండపాన్ని నిర్మించారు. వీటితో పాటు 1926లో యాళ్లూరు ఊరువాకిలి, జిల్లెల్ల, గోస్పాడు, కృష్ణనంది పుణ్యక్షేత్రాల్లో శిల్పాలను తయారు చేశారు. ఇటీవల మహానందిలో ప్రతిష్టించిన రాహుకేతు మండపంలోని విగ్రహాలను రవీంద్రాచారి కుమారుడు శిల్పి శేఖర్‌ ఆచారి తయారు చేయడం విశేషం.