ArticlesNews

‘ పరోపకారార్థం ఇదం శరీరం’

67views

సర్వ జీవరాశుల్లో మనిషికి మాత్రమే విచక్షణాశక్తి ఉంది. మన ఆలోచనలు నీతి, నిజాయతీ దిశగా సాగితే దేవుడికి చేరువవుతాం. మన జన్మ పరులకు ఉపకారం చేసేందుకేనని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. ఎదుటివారికి మేలు చేస్తే వచ్చే ఆనందం స్వర్గవాసం కన్నా మిన్న. మంచి ఆలోచనలే శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆనందానికి మూల కారణమవుతాయి. ‘యద్భావం తద్భవతి’ అన్నారు పెద్దలు. మంచిగా ఆలోచిస్తే మేలు, చెడు తలపులతో కీడు కలుగుతాయి. నిరంతరం నిస్వార్థంగా ఆలోచిస్తే పరులకు సాయపడాలనే దృఢ సంకల్పం మనసులో నిండుతుంది. సర్వ ప్రాణులూ సుఖంగా ఉండాలనే భావన మనసులో మెదులుతుంది. ఆధ్యాత్మిక చింతనతో విశాల దృక్పథం అలవడుతుంది. నిస్వార్థంగా, నిర్మల చిత్తంతో చేసే ప్రతి పనీ దైవికమే. ఇతరుల శ్రేయస్సు గురించి మనం ఆలోచిస్తే, మన మేలును దైవం చూసుకుంటుంది. మన చేష్టలు ఇతరులకు ఆవేదన కలిగించకూడదు. మహానుభావులెందరో అందరికోసం తమ జ్ఞానాన్ని పంచారు. వారు లేకపోయినా ఆ జ్ఞానం సమాజానికి ఉపయోగపడుతుంది. ‘పరుల కోసం పాటుపడని నరుడి బతుకు దేనికి’ అనే సినారె గీతం కూడా ఇదే చెబుతుంది.