News

వ్యతిరేకదిశలో భూకేంద్ర మండలం.. భూమితో పోలిస్తే తగ్గిన భ్రమణ వేగం

53views

భూమి తిరుగుతున్నట్టుగా భూ అంతర్భాగం తిరగడం లేదని అంటున్నారు పరిశోధకులు. భూమి కంటే తక్కువ వేగంతో, వ్యతిరేక దిశలో తిరుగుతున్నట్టు తాజాగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. భూమి లోపల బంతిలా ఉండే భూ కేంద్ర మండలం(కోర్‌) ఇంతకుముందు భూమి కంటే వేగంగా తిరిగేదని, ఆ తర్వాత సమానంగా, ఇప్పుడు తక్కువ వేగంతో తిరుగుతున్నదని పరిశోధకులు తేల్చారు.

చుట్టూ ద్రవరూపంలో ఉన్న పొరలు ఒకవైపు తిరుగుతుంటే, వాటికి వ్యతిరేక దిశగా భూ కేంద్రమండలం తిరుగుతున్నట్టు తేల్చారు. భూ కేంద్ర మండలం తిరిగే వేగం మారుతున్నదని 2023లో ఒక అధ్యయనంలో తేలగా, ఇప్పుడు తాజా అధ్యయనం ఈ వాదనను బలపరుస్తున్నది.

అంతేకాదు, 70 ఏండ్ల కాలచక్రంతో ఇది తిరిగే వేగం మారుతున్నదని సైతం ఈ అధ్యయనం తేల్చింది. భూ ఉపరితలానికి 5,180 కిలోమీటర్ల లోతులో ఉండే భూ కేంద్ర మండలంపై ప్రత్యక్షంగా పరిశోధనలు జరపడం అసాధ్యం. పెద్ద భూకంపాలు సంభవించినప్పుడు రికార్డయ్యే తరంగాలను విశ్లేషించి పరిశోధకులు ఈ కొత్త విషయాలను వెల్లడించారు.