శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భక్తుల కోరికలు తీరితే స్వామివారికి అన్నదానం, బంగారం, వెండి, డబ్బులు, తులా భారంతో పాటు గోవులనూ దానం ఇచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. కదిరి లక్ష్మీనరసిం హస్వామి ఆస్తులన్నీ ఆలయాధికారులు పర్యవేక్షిస్తా రు. అయితే గోవులను మాత్రం పట్టించుకోక పోవడంతో అవి రోడ్లపై తిరుగుతున్నాయి. దీంతో గోవుల సంరక్షణ అధికారులు, పాలకులకు పట్టావా అని భక్తుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
రూ. 20 లక్షలతో గోశాల నిర్మాణం
గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి క్రాస్ సమీపంలోని విశ్వయోగివేమన కొండ వద్ద ఖాద్రీనరసింహస్వామి ఆలయం భూమూల్లో గోశాలను దాదాపు రూ.20 లక్షలతో నిర్మించారు. రేకులషెడ్, చుట్టు ముళ్లకంచె ఏర్పాటు చేశారు. దీన్ని నిర్మించి… దాదాపు పది సంవత్సరాలకు పైగా అవుతోంది. ఇంతవరకు గోశాలలో ఒక్క గోవును కూడా ఉంచిన దాఖలాలు లేవు. దీంతో కదిరి లక్ష్మీనరసింహస్వామికి ఇచ్చిన గోవులు రోడ్లుపై తిరుగుతున్నాయి. మరి రూ.లక్షల ఖర్చు చేసి గోశాల ఎందుకు నిర్మించారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వల్ల గోశాల కూడా నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం ఈ గోశాల మందుబాబులకు అడ్డాగా మరింది.
గో రక్షణపై నిర్లక్ష్యం
కదిరి పురవీధుల్లో, ప్రధాన రహదారిలో ఎటు చూసినా, గోవులు దర్శనమిస్తుంటాయి. కదిరిలో గోవులకు పచ్చి గడ్డి దొరకడం కష్టం. దీంతో అవి చెత్త, వ్యర్థపదార్థాలు తింటూ జీవిస్తున్నాయి. అనారోగ్యం పాలవుతున్నాయి. ఇవి రోడ్లపై సంచరిస్తుండటంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా లక్ష్మీనర సింహస్వామి పేరుతో భక్తులు వదిలిన గోవులను సంరక్షించాల్సిన బాధ్యత ఆలయ అధికారులపై ఉందని, అయినా ఆలయ అధికారులు గోవుల సంరక్షణను ఎందుకు పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.